
యువకుడు దుర్మరణం
గుమ్మఘట్ట: రాయదుర్గం పరిధిలోని గుమ్మఘట్ట మండలంలోని గలగల గ్రామానికి చెందిన హర్షద్ (17) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వివరాల మేరకు.. గ్రామానికి చెందిన హుస్సేన్, షాహినా దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు హర్షద్ ఉన్నారు. కర్ణాటకలోని బట్రళ్లి గ్రామంలో తన మేనమామ దగ్గర టైల్స్ పని నేర్చుకునేందుకు హర్షద్ వెళ్లేవాడు. బుధవారం రాత్రి పని ముగించుకుని స్వగ్రామానికి బైక్‌లో వస్తూ ఉండగా కోనసాగర వద్ద ఏదో వాహనం ఢీకొని వెళ్లిపోయింది. హర్షద్ తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియచేసి సమీపంలోని రాంపుర ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్‌కు తరలించగా అక్కడ మరణించాడు. ఒక్కగానొక్క కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు.
చర్చి పాస్టర్‌గా
బాధ్యతల స్వీకరణ
హుబ్లీ: నవనగర్‌లోని ఈసీఐ చర్చి కొత్త పాస్టర్‌గా కొప్పళ ఈసీఐ చర్చిలో చాన్నాళ్లుగా పని చేస్తున్న రాయచూరు వాస్తవ్యులు, తెలుగు ప్రముఖులు రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొప్పళలో దైవ సేవలతో పాటు నిర్భాగ్యులు, నిరాశ్రయులకు బైబిల్ బోధనలు అనుసారంగా పరిచర్యలు చేశానన్నారు. హుబ్లీ నవనగర్‌లో కూడా నిర్భాగ్యులు, నిరాశ్రయుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు, పరిచర్యలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా సమాజంలో పెరిగిపోయిన అసంతృప్తి, యువత చెడుమార్గం పట్టడం పెరిగిపోతున్నాయని, బైబిల్ వ్యాఖ్యల అనుసారంగా అందరినీ శాంతి, సమాధాన బాటలో నడపడానికి కృషి చేస్తానని రవికుమార్ తెలిపారు.
వ్యవసాయ పనిముట్ల
సంఘానికి ఎన్నిక
సాక్షి,బళ్లారి: కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ పనిముట్ల డీలర్ల సంఘం రాష్ట్ర కోశాధికారిగా బళ్లారికి చెందిన తిమ్మనగౌడ ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం సంఘం కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లోకికెరె నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు బసవనగౌడ మాలిపాటిల్, ప్రధాన కార్యదర్శి మహంతేష్ తదితర ఆఫీస్ బేరర్లు సమావేశం నిర్వహించి బళ్లారికి చెందిన తిమ్మనగౌడను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతుల సమస్యల పరిష్కారానికి తన పరిధిలో ఉన్న అధికారులను ఉపయోగించుకుని రైతులకు మేలు చేస్తానని హామీ ఇచ్చారు.
మౌలిక సౌకర్యాలు కల్పించండి
రాయచూరు రూరల్: జిల్లాలోని అంగన్‌వాడీల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాలూకా, గ్రామ స్థాయిల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల కొరత అధికంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలన్నారు. 14–18 ఏళ్ల లోపు యువతులకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌష్టికాహారం, పోషణ్ ట్రాక్, పోషణ్ అభియాన్ వంటి అంశాలపై పర్యవేక్షణ చేయాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి నవీన్ కుమార్, టీపీ ఈఓ చంద్ర శేఖర్ పవార్, నందిత, బడిగేర, గిరిజా, భాగ్యవతి, పార్వతిలున్నారు.
17న మా మసీదును
సందర్శించండి
బళ్లారి అర్బన్: నగరంలోని కౌల్‌బజార్ జాగృతి నగర్‌లో వెలసిన మసీదులో ఈనెల 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అన్ని మతాల వారికి సందర్శన ఏర్పాటు చేశామని, ఈనేపథ్యంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ చైర్మన్ సౌహిద్‌బాషా తెలిపారు. ఆయన గురువారం పత్రికా భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మానవ స్ఫూర్తిని నిలబెట్టేలా సందర్శన, పరస్పర ప్రేమ, సోదర సందేశాన్ని వ్యాప్తింపజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.పురుషులకు, మహిళలకు కూడా సందర్శన ఉంటుందన్నారు. సమాజంలో శాంతి, సౌహార్ధతను కాపాడేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మసీదులో జరిగే ఈ కార్యక్రమానికి సామరస్య ఐక్యత సృష్టించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వచ్ఛందంగా పాల్గొని మతసామరస్యాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో నిసార్ అహమ్మద్, మునీర్ అహమ్మద్, ఇలియాస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

యువకుడు దుర్మరణం

యువకుడు దుర్మరణం

యువకుడు దుర్మరణం