
దొంగ ఓట్లదారులూ.. దిగిపోండి
సాక్షి,బళ్లారి: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన ఎన్‌డీఏ సర్కార్ దొంగ ఓట్లతో అఽధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. నగరంలోని రాయల్ సర్కిల్ సమీపంలోని గాంధీ భవన్‌లో మహాత్మాగాంధీజీ ప్రతిమకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత మహాత్మా మీరైనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ కొవ్వొత్తులతో ర్యాలీ, నిరసన ప్రకటించారు. తర్వాత అక్కడ నుంచి రాయల్ సర్కిల్ వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ చేశారు. ఓట్ల దొంగతనం చేసిన నేతలు తక్షణం తమ అధికారాన్ని వదులుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. నిష్పక్ష పాతంగా ఎన్నికలు జరిపించాలని కేపీసీసీ మీడియా ప్రతినిధి వెంకటేశ్ హెగ్డే డిమాండ్ చేశారు. సమగ్ర తనిఖీ చేసి దొంగ ఓట్లదారులకు తగిన శిక్ష వేయాలన్నారు.
నేడు పెద్ద ఎత్తున నిరసన
దేశంలో కేంద్రంలో దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని కాపాడాలని, ప్రజాప్రభుత్వానికి గొడ్డలిపెట్టుగా మారిన దొంగ ఓట్లపై తనిఖీ చేయాలనే ఉద్దేశ్యంతో నగరంలోని గవియప్ప సర్కిల్ నుంచి 150 మీటర్ల పొడవైన జాతీయ జెండాను పట్టుకుని నగరంలో ర్యాలీ చేపడతామని, ప్రజాస్వామ్యవాదులందరూ ఏకం కావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రి రహీంఖాన్‌తో పాటు డీసీసీ నాయకులు, కార్యకర్తలు, నగర వాసులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు హుమయూన్‌ఖాన్, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్, గ్యారెంటీ సమితి జిల్లాధ్యక్షుడు చిదానందప్ప, డీసీసీ కార్యాధ్యక్షుడు బోయపాటి విష్ణువర్ధన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలో వరుసగా
మూడు సార్లు బీజేపీకి అధికారం
ఓట్ల చౌర్యంతోనే మూడోసారి
ప్రధానిగా నరేంద్ర మోదీ
ఎన్‌డీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా
కాంగ్రెస్ శ్రేణుల నిరసనాగ్రహం