
మోకా ఎస్‌ఐ భార్య ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: తాలూకాలోని మోకా పోలీసు స్టేషన్ ఎస్‌ఐ కాళింగ భార్య చైత్ర(34) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. ఉదయం మోకాలోని పోలీసు క్వార్టర్స్‌లోని ఇంట్లో ఆమె తలుపులు వేసుకుని బలవన్మరణానికి పాల్పడడం కలకలం సృష్టించింది. భర్త ఎస్‌ఐ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కుమారుడితో పాటు పోలీసు స్టేషన్‌లో మూడు రంగుల జెండాను ఎగరవేశారు. రెండు రోజుల క్రితం తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని వచ్చారు. గత శుక్రవారం ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ కూడా చేయించుకుని సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆమె ఉన్నఫళంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్‌ఐ భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియగానే జిల్లా ఎస్పీ శోభారాణి, ఏఎస్పీ రవికుమార్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. మోకా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు. గత రెండేళ్లుగా ఇదే పోలీసు స్టేషన్‌లో కాళింగ విధులు నిర్వహిస్తున్నారు. మృతురాలు మానసిక వ్యాధితో బాధపడుతుండేవారని సమాచారం.