
ట్రేడింగ్ పేరిట వంచన
హుబ్లీ: ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా డబ్బులను సంపాదించవచ్చని ధార్వాడకు చెందిన వ్యక్తిని నమ్మించి ఏకంగా రూ.22 లక్షలు బదలాయించుకొని మోసగించింది. వివరాలు.. ప్రకాష్‌గౌడ అనే వ్యక్తిని మధుశ్రీ అనే మహిళ మోసగించింది. పరిచయం అయిన ఆ మహిళా ట్రేడింగ్ వ్యవహారం, డబ్బు సంపాదన గురించి వివరించింది. ఈక్రమంలో ముందుగా లాభాలు వచ్చినట్లు నమ్మించి ఆ మేరకు వైసీఎం అనే యాప్‌లో లాభాలను చూపించి రూ.22 లక్షలను తన ఖాతాలోకి బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా జేబు దొంగతనానికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన వెలుగు చూసింది. ఉప నగర పోలీస్టేషన్ పరిధిలో మీరజ్‌నగర్ పెట్రోల్‌బంకు వద్ద బస్టాప్‌లో నిలిబడి ఉన్న బస్సు ప్రయాణికుడి వద్ద జేబు దొంగతనానికి ప్రయత్నించిన సెటిల్‌మెంట్ నివాసి గణేష్(27)ని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వైభవంగా రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా కురిడి గుండూరు భీమేష్ తాత రథోత్సవం వైభవంగా జరిగింది. గురువారం రాత్రి వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. భీమేష్ తాతకు ప్రత్యేక పూజలను కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య నెరవేర్చారు. రథోత్సవంలో రాయచూరు, మాన్వి, సింధనూరు, బళ్లారిల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్లాస్టిక్‌రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
బళ్లారి రూరల్: జిల్లాలో ప్లాస్టిక్ రహిత నేల, నీరు, పర్యావరణం, పరిసరాల సంరక్షణ ఆవశ్యకమని దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి తెలిపారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో అధికారులకు, రైతులకు పర్యావరణం, పరిసరాల పరిరక్షణపై ఏర్పాటు చేసిన జాగృతి కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గతనెల 18న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, పీడీఓలకు, గ్రామాధికారులకు, రైతు సంఘాలకు, సంఘ సంస్థలతో వెబినార్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిసరాల పరిరక్షణ మహత్తరమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మొక్కలను పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శబ్ద, వాయు, జల కాలుష్యాలను అరికట్టాలన్నారు. జెడ్పీ సీఈఓ గిత్తెమాధవ విఠలరావ్, అదనపు జిల్లాధికారి శీలవంత శివకుమార్, రైతు ప్రముఖులు బల్లూరు రవికుమార్, వసంత్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి అదృశ్యం
హొసపేటె: కిర్లోస్కర్ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పని చేసే శ్రీనాథ్ అనే వ్యక్తి పనికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి అదృశ్యం కేసు నమోదైంది. తప్పిపోయిన వ్యక్తి 5.5 అడుగుల ఎత్తు, పలుచని శరీరాకృతి, నలుపు రంగు శరీరఛాయ కలిగి, కుడి చేతిపై ఎస్పీ అనే ఆంగ్ల అక్షరాలను టాటూగా వేయించుకొన్నాడు. అతను బూడిద రంగు ప్యాంట్, నీలం చారల కాటన్ చొక్కా ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, కన్నడలో మాట్లాడగలడని, ఈ వ్యక్తి ఆచూకీ గురించి ఏదైనా సమాచారం ఉంటే మరియమ్మనహళ్లి పోలీస్‌స్టేషన్ లేదా ఎస్‌ఐ సెల్: 9480805769కు సమాచారం అందించాలని ఓ ప్రకటనలో కోరారు.
ఎయిమ్స్ కోసం
కేంద్ర మంత్రితో భేటీ
రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాన మంత్రికి లేఖ రాశారన్నారు. ప్రజా ప్రతినిధులు జిల్లా నేతలతో కలసి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిపై ఒత్తిడి తెస్తామన్నారు. కలబుర్గి, మైసూరు, బెళగావిలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఒపెక్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలకు చర్యలు చేపట్టామన్నారు. రూ.40 కోట్లతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కన్వెన్షన్ భవనం, రూ.10 కోట్లతో ట్రామా కేర్, క్యాన్సర్ యూనిట్లను ప్రారంభించామన్నారు. లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్‌లున్నారు.
ఇద్దరు గంజాయి
విక్రేతల అరెస్టు
హుబ్లీ: నగరంలో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 454 గ్రాముల గంజాయితో పాటు బైకును స్వాధీనం చేసుకొన్నారు. మంటూరు రోడ్డు నివాసి అఽథన్ జుబేద్, సంకేశ్వరకు చెందిన హబీబ్‌ను అరెస్టు చేసి హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.