
పోలీసుల అదుపులో అక్రమ వలసదారులు
కోలారు: అక్రమ వలసదారులుగా అనుమానిస్తున్న ఇద్దరు బంగ్లాదేశీయులను కోలారు జిల్లా శ్రీనివాసపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ బీ నిఖిల్ స్టేషన్ వెళ్లి పరిశీలన జరిపారు. వీరిద్దరు శ్రీనివాసపురం పట్టణ సమీపంలోని బయలు ప్రదేశంలో షెడ్ వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరితో పాటు ఇంకా నలుగురు పిల్లలు, నలుగురు మహిళలు కలిపి మొత్తం 12 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని బెంగుళూరులోని డిటెన్షన్ కేంద్రానికి తరలించనున్నారు. వీరు దేశంలోకి ఎప్పుడు చొరబడ్డారు, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు. వీరితో పాటుఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యాహ్న భోజనంలో బల్లి
● 22 మంది విద్యార్థులకు అస్వస్థత
హోసూరు: మధ్యాహ్న భోజనంలో బల్లి పడి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బేరికె సమీపంలోని కాటినాయకనదొడ్డి గ్రామంలో జరిగింది. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. గురువారం పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తింటుండగా ఓ విద్యార్థికి ఆహారంలో బల్లి కనిపించింది. వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. అంతలోపే 22 మందికి పైగా విద్యార్థులు భోజనం చేశారు. విషయం తెలుసుకొన్న ఉపాధ్యాయులు వండిన ఆహారాన్ని పడేశారు. కొద్ది సేపటికే భోజనం తిన్న 22 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వీరిని బేరికె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కవాతులో విద్యార్థులకు అస్వస్థత
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో నెహ్రూ స్టేడియంలో శుక్రవారం ఉదయం జిల్లా యంత్రాంగం నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ కవాతులో అపశృతి చోటు చేసుకుంది. కవాతు నిర్వహిస్తుండగా ఒక బాలిక, ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ డాక్టర్ ధనంజయ సర్జీ అంబులెన్స్‌లో బాలికను తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందజేశారు. బాలిక కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని డాక్టర్ ధనుంజయ సర్జీ అన్నారు. మరో ఇద్దరు పిల్లలకు సపర్యలు చేశారు. చాలా సేపు నిశ్చలంగా నిలబడి నీళ్లు తాగకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు.

పోలీసుల అదుపులో అక్రమ వలసదారులు

పోలీసుల అదుపులో అక్రమ వలసదారులు