
మహనీయుల త్యాగాలు మరువకూడదు
సాక్షి,బళ్లారి: తెల్లదొరల పాలనను అంతమొందించేందుకు, భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు త్యాగ, బలిదానాలు చేశారని, వారిని మనందరం మరవకూడదని రాష్ట్ర పురపాలక, హజ్ శాఖ మంత్రి రహీంఖాన్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని, మూడు రంగుల జెండాను ఎగరవేసిన తర్వాత మాట్లాడారు. నగరంలో బీఎంసీఆర్‌సీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోలీసులు, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రవి అస్తమించని బ్రిటిష్ సామాజ్య్రాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేశారన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ అహింసా నినాదంతో ఎంతో శ్రమించారన్నారు. జవహర్‌లాల్ నెహ్రు, బాలగంగాధర తిలక్, సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ వంటి మహనీయులు తమ అపారమైన ప్రతిభతో దేశాన్ని ముందుకు నడిపించి బ్రిటిష్ వారిని దేశం విడిచిపెట్టేలా చేశారన్నారు. ఆగస్టు 15వ తేదీ మనందరికి పండుగ రోజు అని అన్నారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, మేయర్ నందీష్, జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణి, ప్రముఖులు ముండ్రిగి నాగరాజు, జే.ఎస్. ఆంజనేయులు పాల్గొన్నారు.
అభివృద్ధి దిశగా బళ్లారి
బళ్లారి నగరంతో పాటు నగరసభలు, పురసభలు, పట్టణ పంచాయతీలు, అన్ని గ్రామాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయని మంత్రి రహీంఖాన్ తెలిపారు. ఆయన శుక్రవారం నగరంలో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఆకట్టుకున్న స్వాతంత్య్ర దిన వేడుకలు
79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలా జరుపుకున్నారు. గవియప్ప సర్కిల్ వద్ద 150 అడుగుల ఎత్తైన స్తంభంలో వెలసిన జెండాను ఎగరవేశారు. జిల్లాధికారి కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి, గాంధీభవన్‌లోని గాంధీజీ విగ్రహానికి, గాంధీజీ చితాభస్మానికి పూల మాలలు వేసి పూజలు చేశారు. జిల్లాధికారి కార్యాలయ ఆవరణలో జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా జెండా ఎగరవేశారు. జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలో రిహార్సల్స్, నృత్యాలు, దేశభక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
ఆర్‌వైఎంఈసీలో..
నగరంలోని ఆర్‌వైఎంఈ కళాశాలలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కళాశాల చైర్మన్ జానేకుంటె బసవరాజు, ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొని జెండా ఎగరవేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని కొనియాడారు.
ఎస్‌జీటీలో కళాశాలలో..
బళ్లారి అర్బన్: కేంద్ర సమాచార శాఖ, శ్రీగురు తిప్పేరుద్ర జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆ సంస్థ డైరెక్టర్ మంజుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యా సంస్థ కార్యదర్శి జీ.నాగరాజు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల బలిదాన ఫలితంగా మనకు స్వాతంత్య్రం లభించిందన్నారు. అలాంటి మహానేతలను ఈసందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించి గౌరవించాలన్నారు. సమాచార శాఖ అధికారి రామకృష్ణ, ఎస్‌జీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రీనారెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శారద, హైస్కూల్ విభాగం హెచ్‌ఎం ఇలియాస్, లెక్చరర్లు కృష్ణప్ప, పద్మావతి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర
బళ్లారి రూరల్ : క్విట్ ఇండియా ఉద్యమంలో దావణగెరె జిల్లావాసులు ప్రాణత్యాగం చేసిన చరిత్ర దావణగెరెకు ఉందని జిల్లా ఇన్‌చార్జి, గనులు విజ్ఞాన, ఉద్యానవన శాఖ మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జున తెలిపారు.స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా శుక్రవారం దావణగెరెలో జాతీయజెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. 1947 ఆగస్టు 15కు మునుపు నుంచి అనేక మంది సమరయోధుల పోరాటంతో బ్రిటీషు వారి నుంచి స్వాతంత్య్ర సిద్ధించిందన్నారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, సరోజినీనాయుడు, లాలా లజపతిరాయ్, టిప్పుసుల్తాను, కిత్తూరు రాణిచెన్నమ్మ తదితర అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులను మనం స్మరించుకోవాలన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో ఆ ఉద్యమాన్ని బలపరచడానికి దావణగెరెలోను స్థానికులు ఉద్యమం చేశారన్నారు. ఆ సమయంలో హళ్లూరు నాగప్ప, అక్కసాలి విరూపాక్షప్ప, బిదిరికుంతి నింగప్ప, హమాలి తిమ్మణ్ణ, నింగప్ప, మాగానహళ్లి హనుమంతప్ప తదితరులు బ్రిటీషువారి తుపాకీ గుళ్లకు బలయ్యారని తెలిపారు. దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభామల్లికార్జున, జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
హొసపేటె: దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీర యోధులందరినీ స్మరించుకోవడం మన ప్రాథమిక కర్తవ్యమని విజయనగర జిల్లా ఇన్‌చార్జ్, గృహ నిర్మాణ, వక్ఫ్, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి బీ.జెడ్.జమీర్ అహ్మద్‌ఖాన్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల వల్ల మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. నాడు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన రాష్ట్రపిత మహాత్మాగాంఽధీ, సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్, అబ్దుల్‌కలాం ఆజాద్, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వంటి వేలాది మంది ధైర్య యోధులను మనం స్మరించుకోవాలన్నారు. రెండేళ్లకు పైగా సాగుతున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన ఐదు హామీలను ఒకే నెలలో అమలు చేశామని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు నిర్మించడానికి, ముఖ్యంగా పేదలు, నిరాశ్రయులకు ఇళ్లను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మొత్తం 2,30,000 ఇళ్లను రాబోయే రోజుల్లో దశల వారీగా మంజూరు చేస్తామన్నారు. నిరాశ్రయులకు ఇప్పటికే 36,799 ఇళ్లు అందించామన్నారు. ఇందుకోసం రూ.500 కోట్లు విడుదల చేశామన్నారు. 2026 చివరి నాటికి లబ్ధిదారులకు పూర్తి ఆశ్రయం కల్పించే దిశగా ఈ పథకానికి నిధులు కేటాయిస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారన్నారు. గ్యారెంటీ పథకాలతో పేదలు, మధ్య తరగతికి చాలా లబ్ధి కలిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ పథకాలను నిలిపివేయబోమన్నారు. ఈ పథకాలతో ప్రజల ఆర్థికస్థితి మెరుగుపడిందన్నారు.
జిల్లాధికారి కార్యాలయంలో..
హొసపేటెలోని జిల్లాధికారి కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాధికారి ఎం.ఎస్.దివాకర్ జాతీయ జెండాను ఎగరవేశారు. జిల్లా పంచాయతీ సీఈఓ నోంగ్‌జోయ్ మహ్మద్ అక్రమ్ అలీ షా, అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ.బాలకృష్ణప్ప, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, రెవిన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా వారు ఆ శాఖ అధికారులతో కలిసి హొసపేటెలోని జోళదరాశి కొండపై జెండాను ఎగరవేశారు.
దేశాభివృద్ధికి కంకణబద్ధులు కావాలి
రాయచూరు రూరల్: భారత దేశ ఐక్యతకు, అభివృద్ధికి నేటి యువత కంకణబద్ధులు కావాలని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ క్రీడాంగణంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగుర వేసి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని మననం చేసుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదలకు ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేశామన్నారు. ప్రజా స్నేహి పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. ఎమ్మెల్యేలు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్, జిల్లాధికారి నితీష్, ఏడీసీ శివప్ప, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, ఏపీఎంసీ అధ్యక్షులు బసనగౌడలున్నారు.
కలబుర్గిలో..
దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహానేత మహాత్మ గాంధీజీ అని కలబుర్గి ఇన్‌చార్జి మంత్రి ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. శుక్రవారం కలబుర్గి సర్దార్ వల్లబ్‌భాయి పటేల్ క్రీడా మైదానంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. నాడు సాధించిన స్వాతంత్య్రం వల్ల నేడు మనం దానిని రక్షించుకోవడానికి ముందుండాలన్నారు. వెనుక బడిన కళ్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా ఈ ఏడాది రూ.5000 కోట్లుకేటాయిుంచారన్నారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి, రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జే) ఉప కార్యాలయం కలబుర్గిలో ఏర్పాటు చేస్తామన్నారు. శాసన సభ్యులు బీఆర్ పాటిల్, అల్లమ ప్రభు, తిప్పణప్ప, ఖనీజా ఫాతిమాలున్నారు.
యాదగిరిలో..
యాదగిరిలోని క్రీడా మైదానంలో గురువారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ మంత్రి శరణ బసప్ప దర్శనాపుర ధ్వజారోహణ చేసి ప్రారంభించారు. జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ముందుండాలన్నారు. కాంగ్రెస్ సర్కార్‌లో పేదలకు ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేశామన్నారు. వరదలు ఎక్కువగా ఉన్నందున పరిహారం, ఇతర కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
చెళ్లకెరెలో..
చెళ్లకెరె రూరల్: ఎందరో మహానుభావుల త్యాగ బలిదానాలతో దేశానికి స్వాతంత్య్రం లభించిందని, అలాంటి మహనీయుల ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని హొయ్సళ బ్యాంక్ జనరల్ మేనేజర్ వీరేష్ తెలిపారు. ఆయన శుక్రవారం బ్యాంక్ కార్యాలయం ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. బ్యాంక్ డైరెక్టర్లు సీ.వీరభద్ర బాబు, ఇంజినీర్ రవి, ప్రహ్లాద్, సిద్ధార్థ, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
స్వాతంత్య్ర ఫలాలను మనందరం అనుభవిస్తున్నాం
రాష్ట్ర పురపాలక, హజ్ శాఖ మంత్రి రహీంఖాన్
ఆకట్టుకున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
వాడవాడలా త్రివర్ణ పతాక రెపరెపలు
హుబ్లీ: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. జిల్లా వ్యాప్తంగా దేశభక్తి పరిమళించింది. ప్రధాన కార్యక్రమం ఆర్‌ఎన్.శెట్టి మైదానంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సంతోష్‌లాడ్ పతాకావిష్కరణ గావించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాక్రమాల గురించి సమగ్రంగా వివరించారు. అంతకు ముందు వివిధ దళాలచే గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాధికారి దివ్యప్రభు, జిల్లా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే హుబ్లీలోని ప్రముఖ ఈద్గా మైదానంలో పాలికె ఆధ్వర్యంలో పతాకావిష్కరణ గావించారు. మేయర్ వీణా, కమిషనర్ రుద్రప్ప గాళి, డిప్యూటీ మేయర్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈద్గా మైదానంలో తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంకా హుబ్లీలోని నెహ్రూ మైదానంలో కూడా అధికారులు పతాకావిష్కరణ చేశారు. ఇంకా జంట నగరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు అన్ని విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు తదితరాలతో పాటు దాదాపు అన్ని చోట్ల జాతీయ పతాకాన్ని అక్కడి ఉద్యోగులు ఎగరవేసి ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకొన్నారు. అలాగే స్టేషన్ సమీపంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని దళిత నాయకులు ఆవిష్కరించారు. తాలూకా కేంద్రాలల్లో ఎమ్మెల్యేలు, తహసీల్దార్ తదితరులు పాల్గొని 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ఆచరించారు. మొత్తం మీద సర్వత్రా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత దేశభక్తితో ఉత్సాహంగా ప్రజలు జరుపుకొన్నారు.

మహనీయుల త్యాగాలు మరువకూడదు

మహనీయుల త్యాగాలు మరువకూడదు

మహనీయుల త్యాగాలు మరువకూడదు

మహనీయుల త్యాగాలు మరువకూడదు

మహనీయుల త్యాగాలు మరువకూడదు

మహనీయుల త్యాగాలు మరువకూడదు

మహనీయుల త్యాగాలు మరువకూడదు

మహనీయుల త్యాగాలు మరువకూడదు