
రూ.కోట్లాది నగదు, కేజీల చొప్పున బంగారు లభ్యం
● ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇంట్లో ఈడీ జరిపిన సోదాలతో వెలుగులోకి
శివాజీనగర: ఉత్తర కన్నడ జిల్లా కార్వారకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రెండు రోజుల నుంచి ముమ్మర సోదాలు చేపట్టారు. తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు, కేజీల కొద్దీ బంగారం స్వాధీనం చేసుకొన్నారు. ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇల్లు, బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.1.68 కోట్ల నగదు, సుమారు రూ.6,20,45,319 విలువ చేసే 6.75 కేజీల బంగారాన్ని అధికారులు జప్తు చేసుకొన్నారు. చరాస్తి, స్థిరాస్తితో పాటు మొత్తం రూ.14.13 కోట్ల విలువ చేసే ఆస్తిని స్వాధీనం చేసుకొన్నారు. ఈడీ అధికారులు 2 పెట్టెల్లో బంగారు, నగదు, ఆధారాలు తీసుకెళ్లారు. ఈడీ సోదాల సమయంలో ఆర్థికత, దోషారోపణ ఆధారాలు, ఈ–మెయిల్, ఇతర ఆధారాలు లభించాయి.
దర్శన్ @7314
యశవంతపుర : రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహర జైలుకు వెళ్లిన నటుడు దర్శన్, పవిత్రాగౌడలకు జైలు అధికారులు నంబర్లు ఇచ్చారు. ఏ1 పవిత్రాగౌడకు–7313, ఏ–2దర్శన్‌కు 7314 నంబర్లను ఇచ్చారు. ఇదే కేసులోని నిందితులు ప్రదోశ్‌కు 7317, నాగరాజుకు 7315, లక్ష్మణ్‌కు 7316 నంబర్ కేటాయించారు.
నేడు కుటుంబసభ్యులు భేటీ?
దర్శన్, పవిత్రాగౌడ కుటుంబసభ్యులు శనివారం జైలుకు వెళ్లి ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. దర్శన్‌తో పాటు మరో ముగ్గరిని ఒకే బ్యారక్‌లో ఉంచారు. పవిత్రాగౌడను క్యారంటైన్‌లో ఉంచారు. ఆమెను ముఖ్యమైన బ్యారక్‌లోకి పంపే అవకాశం ఉందని జైలు అధికారులు తెలిపారు. కాగా గురువారం రాత్రి దర్శన్ రాత్రి నిద్రపోలేదు. సహచరులతో కలిసి మాట్లాడుతూ గడిపారు.
దుష్ప్రచారకులపై చర్యలు తీసుకోండి
మైసూరు : ధర్మస్థలలో మృతదేహాలు పూడ్చి పెట్టారనే కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ వెంటనే మధ్యంతర నివేదికను సమర్పించాలని మైసూరు, కొడగు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మైసూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మస్థలలో మృతదేహాలను ఖననం చేసినట్లు చెబుతున్న కేసులపై సిట్ దర్యాప్తు జరుపుతోందన్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై మధ్యంతర నివేదిక విడుదల చేయాలన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, యూట్యూబర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రూ.కోట్లాది నగదు, కేజీల చొప్పున బంగారు లభ్యం