
దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారిన సామూహిక ఖననం కేసుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు. ధర్మస్థళ పుణ్యక్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, త్వరలోనే నిజం నిలకడ మీద తెలుస్తుందని అన్నారాయన.
ధర్మస్థళలో రెండు దశాబ్దాల కిందట.. హత్యలు, అత్యాచారాలు జరిగాయని, వందల సంఖ్యలో మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని ఓ వ్యక్తి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్షేత్రంలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడిగా చెబుతున్న ఆ 61 ఏళ్ల వ్యక్తి ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయించి అతను చూపించిన చోటల్లా తవ్వకాలు జరిపిస్తోంది. అయితే..
ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలకు దిగడంతో.. డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే ధర్మస్థళపై జరుగుతున్న కుట్ర బయటకు వస్తుందని, ఆ ఆరోపణలు రుజువుకాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తనతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని శివకుమార్ వెల్లడించారు. అయితే..
‘‘నేను ఇప్పటికీ ధర్మస్థళ మంజునాథస్వామి భక్తుడినే. ధర్మస్థల వీరేంద్రహెగ్డే చేసిన సేవలను గౌరవిస్తాం. భక్తునికి– దేవునికి ఉన్న సంబంధానికి మనం భంగం కలిగించరాదు. అలాగని నేనేం ధర్మస్థళకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో మాట్లాడడం లేదు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకవేళ ధర్మస్థళపై నిజంగా కుట్ర జరిగి ఉంటే విచారణలో బయటపడుతుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించకతప్పదు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. ఈ అంశంపై హోం మంత్రి పరమేశ్వర సోమవారం కర్ణాటక అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేస్తారు’’ అని శివకుమార్ వెల్లడించారు.
గురువారం ధర్మస్థళ తవ్వకాలపై అసెంబ్లీలో హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడారు. ‘‘ఫిర్యాదు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు జూన్ 19 సిట్ ను ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించాం. ఇది పూర్తి కావడానికి కాలపరిమితి ఉంటుంది. ఈలోపు సిట్ దర్యాప్తునకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని భావిస్తున్నాం’’ అని అన్నారాయన.
1995-2014 మధ్య తాను పని చేస్తున్న సమయంలో ధర్మస్థళ ఆలయ నిర్వాహకుల ఆదేశాల మేరకు తానే స్వయంగా ఆ మృతదేహాలను పాతిపెట్టినట్లు సదరు వ్యక్తి చెబుతున్నాడు. అందులో మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలు అధికంగా ఉన్నాయని, కొందరిపై లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు.
ముసుగు ధరించిన ఆ వేగు(Whistleblower)ను.. ‘భీమా’.. ‘చిన్నయ్య’.. అని కర్ణాటక మీడియా వ్యవహరిస్తోంది. విక్టిమ్ ప్రొటెక్షన్ కింద సిట్ అతనికి రక్షణ కల్పిస్తోంది కూడా. ఇప్పటిదాకా నేత్రావతి నదీ తీరం వెంబడి అతను చూపించిన చోట్లలో సిట్ తవ్వకాలు జరిపింది. అందులో రెండు చోట్ల మాత్రమే అస్తిపంజరాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు ఆ వ్యక్తి.
ఇదీ చదవండి: ఆలయ నిర్వాహకులే పూడ్చాలని.. సిట్ నన్ను నమ్మడం లేదు
ఇదిలా ఉంటే.. తీవ్ర చర్చకు దారితీసిన ధర్మస్థలలో మృతదేహాల కోసం తవ్వకాల కేసులో గురువారం విధానసభ దద్దరిల్లింది. ధర్మస్థల మీద అసత్య ప్రచారం చేస్తున్న ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోతుందని బీజేపీ, జేడీఎస్ నాయకులు శాపాలు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి 10, 15 ఏళ్ల క్రితం ధర్మస్థల లో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడం ద్వారా పవిత్ర ధర్మక్షేత్రానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా కుట్ర జరుగుతోంది. అస్థికల కోసం తవ్వకాలంటూ హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న అసత్య ప్రచారం సహించడం సాధ్యం కాదు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రజలు ఆవేశం చెంది పోరాటం చేసే స్థితి తీసుకురాకూడదు..
.. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది దర్యాప్తా, హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్రలో అసత్య ప్రచారంలో కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్తుల చేతిలో కీలుబొమ్మగా మారుతోందా?’’ అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సిట్ దర్యాప్తు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అలాగని ధర్మస్థళను టార్గెట్ చేయడం సరికాదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని గుంతలు తవ్వే పనిచేస్తున్నారని, ధర్మస్థల పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని రోజులు ఎన్ని గుంతలు తవ్వారు, ఎన్ని అస్థిపంజరాలు దొరికాయి అనేది చెప్పాలని సునీల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.