
అన్నదాసోహ సేవాకర్త కన్నుమూత
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో శరణ పరంపర, విద్యా క్రాంతి, అన్నదాసోహ సేవాకర్త కలబుర్గి శరణ బసవేశ్వర ఆలయం 8వ పీఠాధిపతి శరణ బసవప్ప అప్ప(90) గురువారం రాత్రి ఇహలోకాన్ని త్యజించారు. గత 10 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయనను గురువారం సాయంత్రం వారి నివాసానికి తీసుకొచ్చారు. ఆయనకు భార్య దాక్షాయణి, ఏడుగురు కుమార్తెలు, 9వ పీఠాధిపతి దొడ్డప్ప అప్ప అనే కుమారుడున్నారు. 1914 నవంబర్ 14న దొడ్డప్ప అప్ప, గోదుతాయి దంపతులకు జన్మించారు. ఆధ్యాత్మిక, ధార్మిక, ధర్మ చింతన, తత్వ జ్ఞానం కలిగి ఉన్నారు. రాజకీయ రంగం నుంచి దూరంగా ఉండడానికి 13వ ఏట షోలాపూర్‌కు వెళ్లి త్రికాల పూజలో నిమగ్నులయ్యారు. 14వ ఏట ముగుళగాన గవిసిద్ద లింగ శివాచార్యతో ధార్మిక విద్యనభ్యసించారు. ప్రాథమిక విద్యా స్థాయి నుంచి బీఏ వరకు కలబుర్గిలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.
ధార్వాడ వర్సిటీ నుంచి ఎంఏ పట్టా
ధార్వాడ విశ్వవిద్యాలయం నుంచి 1953లో ఎంఏ తత్వజ్ఞానంలో పరిణతి పొందారు. బుద్ధ, బసవ, మహావీర, శరణ, దాస పరంపరను అనుసరించారు. 1972–74 మధ్య కాలంలో హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థలకు అధ్యక్షుడిగా పని చేశారు. 1957లో హావేరి శివప్ప అనూర్ శెట్టి కుమార్తె కోమలను వివాహమాడారు. ఆమెకు డాక్టర్ గంగాబిక, నీలాంబిక, ముక్తాంబిక, ఉమా, గోదావరిలు జన్మించారు. ముక్తాంబిక చిన్న వయసులోనే మరణించింది. కలబుర్గిలోని కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పీజీ కోర్సుల ప్రారంబానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భూములను మంజూరు చేయించారు. 1983లో కలబుర్గి శరణ బసవేశ్వర దేవాలయం 8వ పీఠాధిపతిగా శరణ బసవప్ప అప్ప బాధ్యతలు స్వీకరించారు. యాదగిరి జిల్లా సురపురలో ఇంజినీరింగ్ కళాశాల, యాదగిరి, బీదర్, కలబుర్గిలో జూనియర్ కళాశాలలను ప్రారంభించారు. కలబుర్గి శరణ బసవేశ్వర అప్ప దేవాలయాన్ని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సందర్శించారు.
సంతాపం ప్రకటించిన మంత్రులు:
కలబుర్గి శరణ బసవప్ప అప్ప మరణంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, శరణ బసప్ప దర్శనాపూర్, ఈశ్వర్ ఖండ్రేలు సంతాపం వ్యక్తం చేశారు. కలబుర్గి శరణ బసవప్ప అప్ప అంత్యక్రియలను వీరశైవ లింగాయత విధివిధానాలతో దేవాలయం ముందు భాగంలో జరిపారు. వందలాది మంది స్వామీజీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కళ్యాణ కర్ణాటకలో విద్యావేత్తగా గుర్తింపు
60కి పైగా విద్యా సంస్థలు నెలకొల్పిన వైనం

అన్నదాసోహ సేవాకర్త కన్నుమూత