
ధర్మస్థలపై త్వరలో సిట్ నివేదిక
యశవంతపుర: ప్రముఖ దేవస్థానం ధర్మస్థల పరిసరాలలో వందలాది మంది శవాలను పాతిపెట్టారని మాజీ పారిశుధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో సిట్ పోలీసులు గాలింపు చేపట్టడం తెలిసిందే. గత 20 రోజుల నుంచి ఫిర్యాదుదారు చెప్పిన చోటల్లా తవ్వకాలు చేశారు. తోడిన గుంతల్లో మట్టిని నింపకుండా అలాగే వదిలేశారు. ఆధారాలు దొరకని కారణంగా ఎక్కడ తోడినా ఇంక ప్రయోజనం లేదని సిట్ అధికారులు అనుకుంటున్నారు. ఈ కేసులో సిట్ రెండు రోజుల్లో పూర్తి నివేదికను సర్కారుకు ఇవ్వనుంది.
అపరిచితునికి గుబులు
గట్టి ఆధారాలు దొరకని కారణంగా పోలీసులు మట్టిని తోడే పనిని నిలిపేశారు. అస్థిపంజరాలున్నట్లు చెప్పిన అపరిచితునికి ఇప్పుడు భయం ఏర్పడింది. మునుముందు నా పరిస్థితి ఏమవుతుందోనని అతడు గుబులుతో ఉన్నారు. తనకు జీవితకాలం భద్రతను కల్పించాలని కోరుతున్నాడు. కోర్టును, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించాడని విమర్శలు వస్తున్నాయి.
నార్కో పరీక్షలు?
అపరిచిత వ్యక్తి చెప్పిన జాగాలను సిట్ పరిశీలించింది. అతడు ఎస్పీ, కోర్టు ముందు చెప్పినట్లు భారీ సంఖ్యలో మృతదేహాల జాడలు ఎక్కడా బయటపడలేదు. అతడు చెప్పినదంతా అబద్ధం అని, ఎందుకు అలా చెప్పాడో తెలుసుకోవడానికి నార్కో పరీక్షలను జరిపి నిజం కక్కించాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఎంతోమంది వ్యయ ప్రయాసలకోర్చి గుంతలు తవ్వారు, దీనికి డబ్బు కూడా భారీగా ఖర్చయినట్లు సమాచారం. అపరిచితునికి కోర్టు అనుమతులు తీసుకుని సత్యశోధన పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి సిట్ నివేదిక, నార్కో పరీక్షల మీదే నిలబడింది.
ధర్మస్థలతోనే సర్కారు: మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం ధర్మస్థలతోనే ఉంటుందని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కార్ అన్నారు. ఆమె ఉడుపిలో విలేకరులతో మాట్లాడారు. కొందరూ పవిత్రమైన ధర్మస్థలపై మసి పూసి మారేడుకాయ చేయాలని చూశారని అన్నారు. ఇప్పుడు కొండను తోడి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. ధర్మస్థల మీద అపప్రచారం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని మానాలని ఆమె అన్నారు.
20 చోట్ల తవ్వినా ఏమీ దొరకనట్లే
గాలింపు నిలిపివేత