
అగర వెంకన్నకు విశేష పూజలు
బొమ్మనహళ్లి: శ్రావణ శనివారం సందర్భంగా బెంగళూరు బొమ్మనహళ్ళిలోని అగరలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఉదయమే స్వామివారికి పంచామృత అభిషేకం, అలంకారం గావించారు. వందలాదిగా భక్తులు దర్శించుకున్నారు.
చెరువు కబ్జాదారులకు చుక్కెదురు
శివాజీనగర: చెరువు ఆక్రమణల గురించి ఐదుగురికి బీబీఎంపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నగరంలోని కే.ఆర్.పురం సమీపంలో విభూతిపురం చెరువును ఆక్రమించారని, ఆ స్థలాన్ని ఖాళీ చేయిస్తామని ఐదుగురికి పాలికె అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులను రద్దు చేయాలని జీ.వీ.మంజునాథ్, తమిళరసి, పళనిమ్మాళ్, ఎన్.సుందరమూర్తి, జే.శివరామన్ అనేవారు హైకోర్టును ఆశ్రయించారు. భూకబ్జా నిషేధ చట్టం, చెరువు పరిరక్షణ చట్టాల కింద నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పిటిషన్‌దారుల వాదన సమర్థనీయం కాదని జడ్జి కొట్టివేశారు.
ప్రైవేటు స్కూలు బస్సు పల్టీ
శివమొగ్గ: ప్రైవేట్ స్కూలు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన శనివారం జిల్లాలోని హొసనగర తాలూకా రిప్పన్‌పేటె పోలీసు స్టేషన్ పరిధిలోని కానుగోడు గ్రామం వద్ద జరిగింది. వివరాలు.. గర్తికెరెలోని ప్రైవేట్ పాఠశాల బస్సు 12 మంది నర్సరీ విద్యార్థులతో బయల్దేరింది. తమ్మడికొప్ప–మూగుడి మార్గంలో బస్సు డ్రైవర్ నియంత్రణ తప్పడంతో పొదల్లోకి దూసుకెళ్లింది. ఘటనలో ఒక బాలునికి స్వల్ప గాయాలు కాగా మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు చేరుకుని పిల్లలకు బయటకు తీసుకొచ్చారు.
టేకాఫ్ అయిన వెంటనే ల్యాండింగ్
దొడ్డబళ్లాపురం: బెళగావి నుంచి ముంబైకి బయలుదేరిన స్టార్ ఎయిర్ ప్రయాణికుల విమానంలో ఇంజిన్‌లో యాంత్రిక లోపం తలెత్తడంతో బెళగావిలోనే అత్యవసరంగా దిగిపోయింది. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. బెళగావి విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం.. విమానం 48 మంది ప్రయాణికులతో ఉదయం 7:50కి ముంబైకి బయలుదేరింది. కొంతదూరం ప్రయాణించగానే ఇంజిన్‌లో సమస్య కనిపించడంతో పైలట్ తిరిగి బెళగావిలో ఎయిర్‌పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను మరో విమానం ఏర్పాటు చేసి పంపించినట్లు తెలిపారు. కొందరు ప్రయాణికులు ప్రయాణం రద్దు చేసుకున్నారు.

అగర వెంకన్నకు విశేష పూజలు

అగర వెంకన్నకు విశేష పూజలు