
మృత్యు శకటాలైన బస్సులు
యశవంతపుర: ఆర్టీసీ బస్సులు యమశకటాలుగా మారాయి. రెండుచోట్ల నిలిచి ఉన్న లారీలను ఢీకొట్టడంతో ముగ్గురు చొప్పున 6 మంది చనిపోయారు. వివరాలు.. గొర్రెలు, మేకలతో నిలిచిన లారీని కేఎస్ ఆర్టీసీ బస్ ఢీకొనగా ముగ్గురు చనిపోయిన ఘటన బెంగళూరు గ్రామాంతర జిల్లా నెలమంగల తాలూకా గుండేనహళ్లి వద్ద శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగింది. ప్రమాదంలో లారీ క్లీనర్, ఏపీలోని మడకశిరకు చెందిన శ్రీనివాసులు (50), డ్రైవర్ ఆనంద (26), నజీర్ అహ్మద్ (36) అనే వ్యాపారి మరణించారు. వీరు బెంగళూరులో ఉండేవారు, బాగలకోట జిల్లా ముధోళకు వెళ్లి మేకలు, గొర్రెలను కొని లారీలో బెంగళూరుకు వస్తున్నారు. ఘటనాస్థలంలో లారీ పంచరు కావడంతో రోడ్డుపక్కన నిలిపి టైరు మారుస్తున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు లారీ ముందుభాగాన్ని ఢీకొంది. లారీ డ్రైవర్ ఆనంద, శ్రీనివాసులు, నజీర్‌లు తీవ్ర గాయాలతో మరణించారు. బస్సులోని కొందరికి గాయాలు తగిలాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
యల్లాపురలో ముగ్గురు..
ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర మావళ్లి క్రాస్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి మరో దుర్ఘటన జరిగింది. బాగలకోట నుంచి మంగళూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన నిలిపిన కేరళకు చెందిన లారీని వెనుక నుంచి ఢీకొంది. బస్సు డ్రైవర్ ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదం జరిగినట్లు తెలిసింది. బస్సులోని నీలప్ప హరదొళ్లి (40), గిరిజప్పా బూదన్నవర (30) మరో వ్యక్తి (40) చనిపోగా, 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బాగలకోట నుంచి కూలి పనుల కోసం మంగళూరుకు వలస వెళుతున్నట్లు తెలిసింది. బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
నెలమంగల, ఉత్తర కన్నడలో
నిలిచిన లారీలను ఢీ
6 మంది దుర్మరణం

మృత్యు శకటాలైన బస్సులు