
వానాకాలం.. చర్చల యుద్ధం
శివాజీనగర: రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అనేక నీటి ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోయాయి, ఈ తరుణంలో నేడు సోమవారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లు కత్తులు నూరుతున్నాయి. అభివృద్ధి కార్యాలకు నిధుల కొరత, ఎమ్మెల్యేల నిధుల విడుదల్లో తారతమ్యం, చిన్నస్వామి క్రీడా మైదానం వద్ద తొక్కిసలాట, కులగణన సర్వేల గొడవలు, రైతులకు ఎరువుల కొరత వంటి అనేక అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి.
సై అంటే సై అనేలా
ఇక కాంగ్రెస్ మంత్రులు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను ప్రస్తావించి ప్రతిపక్షాలను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఓట్ల దొంగతనం, మహదాయి, మేకదాటు ప్రాజెక్టులకు ఆమోదం రాకపోవడం, కేంద్రం రాష్ట్రానికి అధిక నిధులు ఇవ్వకపోవడం, బీజేపీ ఎంపీల మౌనం తదితరాలను అస్త్రాలుగా వాడుకోనున్నారు. సభల్లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం చెలరేగే అవకాశం ఉండడంతో వర్షాకాల సమావేశాలు వేడెక్కడం ఖాయం. ఈ శాసనసభ సమావేశాలు ఆగస్టు 21వ వరకు జరుగుతాయి. ఒక సెలవు పోను 9 రోజులు చర్చలు సాగుతాయి. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ గురించి 16న ప్రత్యేకంగా చర్చిస్తారు. చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాటపై మైకేల్ కున్హా నివేదిక సహా పలు ముఖ్య అంశాలు చర్చకు రానున్నాయి.
నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
అధికార, ప్రతిపక్షాల చేతిలో అస్త్రాలు
21వ వరకు శాసనసభ
తొక్కిసలాట కేసు నేపథ్యంలో కర్ణాటక జన రద్దీ బిల్లు, ద్వేష ప్రసంగం, ద్వేష నేరాల నిరోధక బిల్లు, అబద్ధాల వార్తల నియంత్రణ బిల్లు లాంటి ప్రధాన బిల్లులు ఈ సమావేశాల్లో సర్కారు ప్రవేశపెట్టనుంది. గ్రేటర్ బెంగళూరు– పాలికెల విభజన, ఎన్నికల గురించి చర్చకు రావచ్చు. కర్ణాటక నగర, పట్టణ పథకాలు, ఇతర న్యాయ సవరణ బిల్లు, రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు, టూరిజం వ్యాపార సవరణ బిల్లు, దేవదాసీ వ్యవస్థ నిషేధ పరిహార, పునరావసతి బిల్లు, అత్యవసర సేవల నిర్వహణా సవరణ బిల్లుతో పాటుగా మొత్తం 23 బిల్లులను ప్రవేశపెట్టి అనుమతి పొందేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది.
ప్రధాన బిల్లులకు
అవకాశం

వానాకాలం.. చర్చల యుద్ధం