
ఉత్సాహంగా ప్రధాని మోదీ టూర్
బనశంకరి: బెంగళూరులో ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఒక్కరోజు పర్యటన ఉత్సాహంగా సాగింది. బెంగళూరు– బెళగావి మధ్య వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపారు. బెంగళూరు నగరవాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నమ్మ మెట్రో ఎల్లో మార్గంలో సర్వీసులకు నాంది పలికారు. మెట్రో ఫేజ్–3కి శంకుస్థాపన చేశారు.
ఘన స్వాగతం
తొలుత ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మేఖ్రి సర్కిల్‌కు వచ్చి అక్కడి నుంచి కార్ల కాన్వాయ్‌లో మెజెస్టిక్ సంగోళ్లి రాయణ్ణ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. దారిపొడవునా బీజేపీ కార్యకర్తలు, జనం కాషాయ జెండాలు పట్టుకుని స్వాగతించారు. మోదీ కూడా చేతులు ఊపుతూ నమస్కరించారు. ప్రముఖ రోడ్లు, సర్కిల్స్‌లో మోదీ బృహత్ ఫ్లెక్సీలు వెలిశాయి. నగరమంతా కాషాయమయంగా మారిపోయింది.
మెట్రో రైలులో ప్రయాణం
మోదీతో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రులు హెచ్‌డీ.కుమారస్వామి, మనోహర్‌లాల్ ఖట్టర్, వీ.సోమణ్ణ, శోభా కరంద్లాజే, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీసీఎం డీకే.శివకుమార్, మంత్రులు ఉన్నారు. మెజెస్టిక్ నుంచి ఆర్‌వీ.రోడ్డు రాగిగుడ్డ మెట్రోస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రధాని మెట్రో ఎల్లో లైన్‌లో రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. అదే రైలులో ఎలక్ట్రానిక్ సిటీ వరకు ప్రముఖులతో కలిసి ప్రయాణించారు. ప్రజలు, బాలలతో ముచ్చటించారు.
కర్ణాటకకు భారీగా రైల్వే నిధులు
కర్ణాటకలో రైల్వే వసతుల పెంపునకు బడ్జెట్‌లో 9 రెట్లు పెరిగిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. మెట్రో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2014 కు ముందు కర్ణాటకకు వార్షిక రైల్వే కేటాయింపులు రూ.835 కోట్లు, కానీ 2025–26లో అది రూ.7,564 కోట్లకు చేరుకుందన్నారు. అమృత భారత్ స్టేషన్ కింద 61 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు, 123 ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మాణదశలో ఉండగా, విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
మెట్రోలో మా నిధులే ఎక్కువ: సీఎం
మెట్రో రైలు పథకంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 50: 50 చొప్పున ఖర్చును భరించాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వమే అధికంగా వ్యయం చేసిందని సీఎం సిద్దరామయ్య అన్నారు. మెట్రో ఎల్లో లైన్ ప్రారంభోత్సవం సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎల్లో మార్గానికి రూ.7,160 కోట్లు ఖర్చుచేశామని అన్నారు. 2030 నాటికి 220 కిలోమీటర్లు పొడవునా మెట్రో మార్గాలు ఉండాలని, ఇది పూర్తయితే నిత్యం 30 లక్షల మంది ప్రయాణించవచ్చునని తెలిపారు. మూడో దశ మెట్రో పనుల డీపీఆర్‌ను కేంద్రానికి కూడా పంపించామని, అనుమతి రాగానే పనులు ప్రారంభించవచ్చునన్నారు. నిధులలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లే కర్ణాటకకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానిని డిమాండ్ చేశారు.
బెంగళూరులో మెట్రో రైలు ఎల్లో
లైన్ ప్రారంభం
బెంగళూరు– బెళగావి వందే భారత్‌కు పచ్చజెండా
మెట్రో మూడో దశకు శంకుస్థాపన
మూడో దశ 44 కిలోమీటర్లు
ఎలక్ట్రానిక్ సిటీ ఐఐఐటీ సభాంగణంలో మెట్రో మూడో దశకు మోదీ శంకుస్థాపన చేశారు. మూడో స్టేజ్ పథకం 44.65 కిలోమీటర్లు పొడవు కాగా, రూ.15 వేల కోట్ల వ్యయం కానుంది. మెట్రో 3స్టేజ్‌లో జేపీ.నగర నుంచి కెంపాపుర వరకు, హొసహళ్లి నుంచి కడబగరె వరకు మెట్రో మార్గం నిర్మాణమవుతుంది.
ఫ్రీ బస్ కంటే మెట్రోనే ఇష్టం!
మెట్రో రైలులో ప్రయాణంలో ప్రధాని మోదీ, సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే.శివకుమార్ సరదాగా నవ్వుకున్నారు. రైలులో మహిళలతో మోదీ మాట్లాడుతూ మీకు ఉచిత బస్సు ఇష్టమా, మెట్రో రైలు ఇష్టమా అని అడిగారు. మహిళలు మాకు మెట్రో ప్రయాణమే ఇష్టమని చెప్పారు. దీంతో మోదీ , సీఎం, డీప్యూటీ సీఎం వైపు చూసి సిద్దరామయ్య గారు, మీ ఫ్రీ బస్‌ను ఇష్టపడటం లేదని చెప్పడంతో అందరూ నవ్వారు.

ఉత్సాహంగా ప్రధాని మోదీ టూర్

ఉత్సాహంగా ప్రధాని మోదీ టూర్