
ఒకే వేదికపై 200 రకాల బియ్యం
మైసూరు: మైసూరు నగరంలోని నంజరాజ బహద్దూర్ చత్రంలో సహజ సమృద్ధ, వరిని కాపాడుదాం అనే నినాదంతో రెండు రోజుల దేశీయ వరి మేళా ఆరంభమైంది. వివిధ జాతులకు చెందిన బియ్యంతో పాటు ఔషధ గుణాలున్న బియ్యం కూడా ప్రదర్శనలో ఉన్నాయి. దేశీయ బియ్యంతో చేసిన అన్నం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు తెలిపారు.
పాలిష్ బియ్యం ప్రమాదం
ప్రస్తుతం చేతుల్లో నుంచి జారిపోయే పాలిష్ చేసిన బియ్యంనే ప్రజలు వాడుతున్నారు. ముడి బియ్యాన్ని ఎవరూ తినడం లేదు. దీని వల్ల త్వరగా షుగర్, ఊబకాయం, కీళ్లనొప్పులు వంటి అనేక జబ్బులు వస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు.
ఈ ప్రదర్శనలో ఉన్న పలు రకాల దేశీయ బియ్యం గురించి వివరించారు. పాలిష్ చెయ్యని ముడి బియ్యాన్ని ఉపయోగించడం ఆరోగ్యానికి ఉత్తమమని చెప్పారు.
అలాగే పలు ప్రాంతాల రైతులు సాగు చేసిన ఔషధ విలువలున్న బియ్యం కూడా అందుబాటులో ఉన్నాయి. ఎరుపు, పసుపు, నలుపు, గోధుమ రంగుల బియ్యాలను చూడవచ్చు.
అమ్మో ఎన్ని రకాలో
పాత మైసూరు ప్రాంతంలో పేరుపొందిన రాజముడి, రత్నచూడి, రాజభోగ, పుట్ట వరి, ఏనుగు కొమ్ముల వరి, బంగారం కడ్డీ, ముండుగ, పాలుబ్బులు, ఇలా అనేక రకాల జాతుల బియ్యం బస్తాలు కొలువుతీరాయి. కన్నడనాట ప్రసిద్ధి చెందిన బియ్యం అయిన కరిగజిలివి, రాజముడి, దొడ్డగ, దొడ్డబైరనెల్లు, సిద్దసణ్ణ, సేలం సన్న, రాజభోగ, ఆందనూరు సన్న, ఉదురు సాలి, గిణిసాలి రకాలను కూడా చూడవచ్చు. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, యూపీ, ఒడిశా, అసోం, కేరళ ప్రాంతాల నుంచి ఉత్తమ జాతి వరిని తీసుకొచ్చారు. మేళా సుమారు 200 కుపైన వివిధ జాతుల బియ్యాన్ని రైతులు, వ్యాపారులు ప్రదర్శనలో ఉంచారు. కొనుగోళ్లు కూడా బాగానే జరిగాయి. నగరం నలుమూలల నుంచి సందర్శకులు తరలివచ్చారు. ఇన్ని రకాల బియ్యం ఉన్నాయా? అని అబ్బురపడ్డారు.
మైసూరులో దేశీయ బియ్యం మేళా

ఒకే వేదికపై 200 రకాల బియ్యం