
జై కనకదుర్గ
కేజీఎఫ్: నగరంలోని గణేష పురంలో వెలసిన శ్రీ దుర్గా దేవి ఆలయంలో ఆదివారం 154 వ శ్రావణ జాతర మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు కంకణధారణతో పూజలు ఆరంభమై మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళారతి వరకు జరిగాయి. గంగమ్మ, దుర్గా దేవికి విశేష అలంకరణ చేశారు. ధర్మకర్తలు వి.మోహన్, పి.దయానంద. తదితరులు పాల్గొన్నారు.
రాఘవుల ఆరాధన
మండ్య: శ్రీరాఘవేంద్ర గురు సార్వభౌమ 354వ ఆరాధనా మహోత్సవాలను జిల్లాలోని వివిధ రాయల మఠాల్లో, ఆలయాలలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయి. మండ్య నగరంలోని శ్రీవ్యాసరాజ మఠంలోని రాఘవేంద్రుల బృందావనానికి అలంకరించి పూజలు చేశారు. నగరంలో ఉన్న కావేరి నగరలో ఉన్న రాయల మఠంలోనూ ఆరాధనా వేడుకలు జరిగాయి.
ఆర్‌సీబీ సంబరాలపై
మరో కేసు
శివాజీనగర: జూన్ 4 తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాలలో విధానసౌధ ముందు, కబ్బన్‌పార్క్‌లో జనం రాక వల్ల పచ్చిక మైదానం, మొక్కలు, చెట్లు దెబ్బతిన్నాయని, దీంతో కోట్లాది రూపాయలు నష్టమైందని కబ్బన్ పార్కు అసోసియేషన్ హైకోర్టులో కేసు వేసింది. కబ్బన్‌పార్కుకు ఎక్కువ నష్టం కలిగిందని, దీనికి ఆర్‌సీబీ, కేఎస్‌సీఏ దే బాధ్యత అని ఆరోపించింది. ఈ నష్టాన్ని ఆ సంస్థలే భరించాలని కోరింది. ఆ రోజు ఆర్‌సీబీ సంబరాలలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోగా, 60 మందికి పైగా గాయపడడం తెలిసిందే. ఈ కేసులకు తోడు పార్కు నష్టం కేసు దాఖలైంది.
పాము కాటుకు
స్నేక్ క్యాచర్ బలి
హుబ్లీ: అతను పాములు పట్టడంలో నేర్పరి. ఇప్పటి వందల పాములను బంధించి, సురక్షితంగా అడవుల్లోకి వదిలాడు. అలా చాలా మంది ప్రజలను పాము కాట్ల నుంచి కాపాడాడు. కానీ విధి వక్రించి పాముకే బలయ్యాడు. ఈ విషాద ఘటన ధార్వాడలోని గిరినగర్లో చోటు చేసుకుంది. స్థానికు సయ్యద్ హసన్ అలీ (50), ధార్వాడలో ప్రముఖ స్నేక్ క్యాచర్‌గా పేరుపొందాడు. ఎలాంటి సర్పాన్నయినా లాఘవంగా పట్టేస్తాడు. ప్రజలు ఎక్కడ పాము కనిపించినా అలీకి ఫోన్ చేసేవారు. అదే మాదిరిగా శనివారం గిరినగరలో ఓ ఇంట్లో పాటు కనిపించగా పట్టుకునే బయటకు తెచ్చే క్రమంలో అది చేతికి కాటు వేసింది. విష ప్రభావంతో కొంతసేపటికే అలీ మరణించారు.

జై కనకదుర్గ