
మొబైల్‌ఫోన్, అందులోని ఇంటర్నెట్, సోషల్ మీడియా, గేమ్స్ అనేవి డ్రగ్స్ మాదిరిగా వ్యసనమవుతున్నాయి. ఎంతోమంది జీవితాలను బలిగొంటున్నాయి. ముఖ్యంగా బాలలు, యువకులు మొబైల్ గేమ్స్ మాయలో పడి విలువైన జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అటువంటి రెండు విషాద సంఘటనలు బెంగళూరులో సంభవించాయి.
బనశంకరి: సిలికాన్ సిటీలో చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్ పరిదిలో 14 ఏళ్లుబాలుడు గాంధార్ డెత్‌నోట్‌రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లిదండ్రులు జి.గంగాధర్, సవిత గాన సంగీత కళాకారులు కాగా, ఘటన సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. బాలుడు పద్మనాభనగరలో ప్రైవేటు స్కూలులో 7వ తరగతి చదివేవాడు. ఇంట్లో ఎలాంటి సమస్య లేదు, తల్లిదండ్రులు, సోదరునితో అన్యోన్యంగా ఉండే గాంధార్ ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబానికి షాక్ ఇచ్చింది.
స్వర్గంలో ఉంటాను
రాత్రి అందరితో కలిసి భోజనం చేసి తన పెంపుడు శునకంతో నిద్రకు ఉపక్రమించిన గాంధార్ తెల్లవారుజామున తన గదిలో ఉరివేసుకునే ముందు డెత్‌నోట్‌ను రాశాడు. తల్లిదండ్రులను ఉద్దేశించి.. మీరు నన్ను 14 ఏళ్లు బాగా పెంచారు. మీతో చాలా సంతోషంగా ఉన్నాను, కానీ నేను వెళ్లే సమయం వచ్చింది. మీరు ఈ లేఖ చదివేలోగా నేను స్వర్గంలో ఉంటాను అని రాశాడు. అందులో కొన్ని బొమ్మలను కూడా గీశాడు.
ఆ వెబ్ సిరీసే..
బాలుడు చిన్న వయసులో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనే ప్రశ్న తలెత్తింది. పోలీసులు విచారణ జరపగా కలవరపరిచే అంశాలు బయటపడ్డాయి. గాంధార్ జపనీస్ భాషలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన డెత్‌నోట్ వెబ్ సిరీస్‌ను క్రమం తప్పకుండా చూసేవాడు. అంతేగాక వెబ్‌సీరీస్‌లో వచ్చే ఒక పాత్రను గాంధార్ తన రూమ్‌లో గీశాడు. ఈ వెబ్‌సీరీస్‌లో ఒక పాత్ర ఉంది. ఈ పాత్ర చెప్పినట్లు హీరో నడుచుకుంటాడు. ఆ మాయా బుక్‌లో ఎవరిపేరు రాసి వారు ఎలా చనిపోవాలి అనే ఊహించుకుంటే ఆ వ్యక్తి ఆ విధంగా చనిపోతాడు. చెడ్డవారు ఎవరూ కూడా భూమిపై ఉండరాదు, వారందరినీ అంతం చేయాలి అనేది ఈ వెబ్ సిరీస్ కథ. ఈ డెత్‌నోట్ వెబ్‌సిరీస్‌ను నిరంతరం చూసి దీని ప్రభావానికి లోనైన గాంధార్ ఆ మాదిరిగా ప్రాణాలు తీసుకున్నాడనే అనుమానం వ్యక్తమవుతోంది. బాలుని మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.