ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులకు ఉత్తేజం
బళ్లారిటౌన్: విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు ఇవ్వడం వల్ల వారిని ఉత్తేజ పరిచినట్లు అవుతుందని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎస్‌ఎన్ రుద్రేష్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని పత్రికా భవనంలో కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేపట్టిన ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ద్వితీయ పీయూసీల్లో ప్రతిభ కనబరిచిన విలేకరుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలను అందజేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్‌కు పేష్వా చేసిన సహాయంతో దేశ రాజ్యాంగాన్ని రచించేలా ఎదిగారని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్న విద్యార్థులకు కొంత ప్రోత్సాహ ధనం ఇవ్వడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేకే ట్రస్ట్ నేత జోళదరాశి తిమ్మప్ప మాట్లాడుతూ డబ్బును దొంగలు దోచుకుపోవచ్చు కానీ విద్యను ఎవరూ దోచుకోలేరని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్.వీరభద్రగౌడ, అడహక్ కమిటీ సభ్యులు కే.మల్లయ్య పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు దివ్యశ్రీ, కాంచన, నాగాంబిక, అశ్విత చౌదరి, కార్తీక్, సంజన, హేమంత్‌కుమార్, యశ్వంత్‌కుమార్‌లకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు.


