దోపిడీదొంగల అరెస్టు
యశవంతపుర: జాతీయ రహదారిలో దోపిడీకి ప్లాన్ వేసిన గురుడ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి కారంపొడి, కత్తిని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళూరు చొక్కబెట్టుకు చెందిన జలీల్ హుసైన్, భట్కళ హెబళె గాంధీనగరకు చెందిన డ్రైవర్ నాసీర్ హకీమ్‌ను అరెస్ట్ చేశారు. జలీల్‌పై ఇప్పుటీకే 11 కేసులు, నాసీర్‌పై 2 కేసులున్నట్లు భట్కళ పోలీసులు తెలిపారు. మరో నిందితుడు మైనర్ బాలుడు కాగా, అతనిపై కూడా ఒక కేసు ఉన్నట్లు పోలీసులు వివరించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హైవే మీద తెల్లవారుజామున ఐదు మంది పొంచి ఉండి, ఎవరైనా కనిపిస్తే దోచుకోవాలని సిద్ధమయ్యారు. అదే మార్గంలో వెళ్లతున్న భట్కళ పోలీసుల కంట పడ్డారు. ముగ్గురిని పట్టుకుని ఠాణాకు తరలించారు. ఇటీవలి కాలంలో నేరగాళ్లు గరుడ పేరుతో ముఠాలను ఏర్పాటు చేసుకుని హల్‌చల్ చేయడం పెరిగింది.
డ్యాన్స్‌మాస్టర్ వంకరబుద్ధి
కృష్ణరాజపురం: డ్యాన్స్ మాస్టర్ వంకర బుద్ధి ప్రదర్శించాడు. డ్యాన్స్ పేరుతో బాలికను తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.ఈ ఘటన బెంగళూరు నగరం మహదేవపుర నియోజకవర్గంలోని కాడుగొడిలో జరిగింది. భారతీ కన్నన్(32) అనే వ్యక్తి చిన్నారులకు డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తుంటాడు. ఈ నెల 24న ఓ బాలికను డ్యాన్స్ శిక్షణ పేరుతో కారులో ఎక్కించుకొని నగరంలో పలు ప్రాంతాల్లో తిప్పాడు. ఈక్రమంలో లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో కాడుగోడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.


