ఐదేళ్ల లోపు పిల్లలకు టీకాలు తప్పనిసరి
హొసపేటె: జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఈ నెల 31 వరకు, జూన్ 23 నుంచి 28 వరకు ప్రత్యేక టీకా అభియాన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆర్‌సీహెచ్ అధికారి జంబయ్య తెలిపారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో కల్లహళ్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌లో ప్రత్యేక టీకా ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని పిల్లలందరూ టీకాలు వేయించుకోవడం తప్పనిసరి అన్నారు. ముఖ్యంగా టీకాలు వేయని పిల్లలకు ప్రత్యేక టీకా అభియాన్‌లో టీకాలు వేస్తారన్నారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు తప్పకుండా టీకాలు వేయించాలని అన్నారు. కార్యక్రమంలో తాలూకా ఆరోగ్య అధికారిణి డాక్టర్ వినోద, జిల్లా ఆరోగ్య విద్య అధికారి ఎంపీ.దొడ్డమని, జిల్లా ఆరోగ్య ఇన్‌స్పెక్టర్ ఎం.ధర్మనగౌడ, ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ అధికారిణి లత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నందిని, ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


