మరమ్మతులకు నోచని క్రస్ట్‌గేట్లు
● డ్యాంకు మళ్లీ తప్పని ప్రమాదం ముప్పు
హొసపేటె: తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్ గేట్ తెగిపోయి నెలలు గడిచాయి. కూలిపోయిన క్రస్ట్‌గేట్ మరమ్మతు పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వేసవిలోగా 19వ క్రస్ట్‌గేటు మరమ్మతులు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైనందున ప్రభుత్వం మిన్నకుండి పోతున్నట్లు కనిపిస్తోంది. ఇది స్థానికులను, రైతులను ఆగ్రహానికి గురి చేసింది. గేటును జోడించే ప్రక్రియ టెండర్ దశలోనే ఉంది. స్థానికంగా వ్యతిరేకత ఉంది. వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పుడు మూడు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్ చెబుతున్నారు. 19వ గేట్ మాత్రమే కాదు, అన్ని గేట్లను మార్చాలని నిపుణులు అంటున్నారు. కానీ కనీసం 19 గేట్ పనులు కూడా ప్రారంభం కాలేదు. మిగిలిన గేట్ల మరమ్మతులు చేయకపోతే జలాశయం ప్రమాదంలో పడుతుంది. ఫలితంగా నీటిమట్టం 75 శాతం మాత్రం నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. 133 టీఎంసీల సామర్థ్యం గల జలాశయం 30 టీఎంసీల వరకు పూడిక చేరుకోవడంతో కేవలం నీటి నిల్వ 100 టీఎంసీలకు మాత్రం పరిమితం అయింది. ప్రస్తుతం గేట్లు మరమ్మతులు చేయకుండా ఉంటే 60 నుంచి 70 టీఎంసీలకు మాత్రమే నీటి నిల్వ పరిమితం కానున్నది. దీని వల్ల రైతులు తమ రెండో పంటకు సక్రమంగా నీరు పొందలేని పరిస్థితి ఏర్పడటం ఖాయమని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


