గ్యారంటీలకు నిధుల కొరత లేదు
హొసపేటె: హామీ పథకాలు తగినంతగా చేరడం లేదని ప్రజలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వం హామీ పథకాలకు నిధుల కొరత లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం నగరంలోని పునీత్ జిల్లా క్రీడా మైదానంలో ఈనెల 20న నిర్వహిస్తున్న సాధన సమావేశపు వేదిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతేడాది లానే ఈ ఏడాది బడ్జెట్‌లోనూ హామీలకు నిధులిచ్చామన్నారు. గత ఏడాది కన్నా ఈసారి అదనంగా రూ.3 వేల కోట్లను అదనంగా బడ్జెట్‌లో కేటాయించామన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత పథకాలపై ఇతర రాష్ట్రాల్లో కూడా కాపీ కొడుతున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 20న విజయనగర జిల్లా హొసపేటెలో ప్రభుత్వం సాధన సమావేశం నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమం పక్కాగా ప్రభుత్వ కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. అదే రోజు సుమారు 1 లక్ష 3 వేల మంది పేదలకు హక్కు పత్రాలను అందిస్తామన్నారు.
అతిరథ మహారథుల రాక
కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా, కేబినెట్ మంత్రులు, మొత్తం ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలన్నారు. గ్రేటర్ బెంగళూరుకు సంబంధించి ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్ విమర్శలపై ప్రతిస్పందిస్తూ, అప్పటి బీజేపీ పట్టణాభివృద్ధి మంత్రి సురేష్‌కుమార్ బెంగళూరు చాలా పెద్దదిగా పెరిగినందున, విభజన చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత బెంగళూరు నగరానికి మూడు లేదా అంత కంటే ఎక్కువ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు జమీర్ అహమ్మద్ ఖాన్, శివరాజ్ తంగడిగి, బోసురాజు, కృష్ణబైరేగౌడ, హెచ్‌కే పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
సాధన సభ సర్కారు కార్యక్రమం
ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడి


