ఎండిన చెరువు.. చేపల మృత్యువు
రాయచూరు రూరల్: ప్రతి ఏడాది చెరువులో నీరు నిల్వ ఉండేవి. మత్స్యకారులు చేపలను పట్టి అమ్ముకుని పొట్టపోసుకునేవారు. నగరానికి 13 కి.మీ. దూరంలోని మర్చేడ్ సమీపంలోని చెరువు పూర్తిగా ఎండిపోవడంతో లక్షలాది చేపలు వేసవి తాపానికి మరణించాయి. చనిపోయిన చేపలను తినడానికి పక్షులు వస్తున్నాయి. చెరువులో మరణించిన చేపలతో గ్రామంలో దుర్వాసన వెదజల్లుతోంది. ప్రతి ఏడాది నీరు పుష్కలంగా ఉండేవి. ఆ సమయంలో పక్షులు వలస వచ్చేవి. చెరువులో నీరు ఇంకిపోయి చేపల మృతితో వలస పక్షులు చేపలను తింటున్నాయి.
అభివృద్ధి పనులకు శ్రీకారం
హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలో 80 శాతం పనులు త్వరలో పూర్తవుతాయని ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్ తెలిపారు. సోమవారం మరియమ్మనహళ్లి పట్టణంలో రూ.9 కోట్ల ఖర్చుతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, పాఠశాల కాంపౌండ్ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించిన అనంతరం మాట్లాడారు. పట్టణంలోని 15 వార్డులకు కేకేఆర్డీహెచ్, డీఎంఎఫ్ గ్రాంట్ల కింద పాఠశాలల ప్రాంగణానికి కాంపౌండ్, సీసీ డ్రైనేజీ నిర్మాణానికి దాదాపు రూ.9 కోట్ల గ్రాంట్ మంజూరైందన్నారు. అదనంగా పట్టణంలోని దుర్గాదాస్ థియేటర్ కోసం ప్రేక్షకుల గ్యాలరీ నిర్మాణానికి సుమారు రూ.50 లక్షల గ్రాంట్ అందిస్తారన్నారు. రాఘవేంద్ర స్వామి మఠానికి రూ.25 లక్షలు, 12వ వార్డు అభివృద్ధికి రూ.1 కోటి నిధులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి మలప్రభ కుడి కాలువకు నీరు విడుదల
హుబ్లీ: మలప్రభు కుడిగట్టు కాలువ పరిధిలో జిల్లాలోని నవలగుంద, అణ్ణిగేరి, హుబ్బళ్లి, కుందగోళ తాలూకాల్లోని వివిధ గ్రామాలకు తాగునీటి అవసరాల నిమిత్తం సంబంధిత చెరువులకు నీటిని నింపుకొనే ఉద్దేశంతో బెళగావి డివిజన్ కమిషనర్ మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు నవిలుతీర్థ జలాశయం నుంచి మలప్రభ కుడిగట్టు కాలువ ద్వారా నీటిని విడుదల చేయడానికి ఆదేశాలిచ్చారు. నీటిని సద్వినియోగం చేసుకోవడానికి నిఘా వహించాలని జిల్లా స్థాయి సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు జిల్లాధికారిణి దివ్యప్రభు తెలిపారు. ఈ మేరకు స్థానిక మీడియాకు వివరాలు తెలిపారు. సదరు ఆదేశం మేరకు ప్రజలకు, పశుపక్షాదులకు తాగునీటి కోసం, నరగుంద, రోణ తాలూకాల్లోని బహుగ్రామ తాగునీటి పథకాలు, చెరువులను నింపడానికి నరగుంద ఉప కాలువ, సంబంధిత ప్రాంతాలకు నవిలుతీర్థ జలాశయం నుంచి నీటి విడుదలకు సూపరింటెండెంట్ ఇంజినీర్‌కు ఆదేశాలిచ్చినట్లు ఆమె తెలిపారు. నీటి పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బందిని, నోడల్ అధికారులను నియమించామన్నారు.
నాటక, సాహిత్య, గమక కళల్లో మేటి దొడ్డనగౌడ
బళ్లారిఅర్బన్: నాటకాలు, సాహిత్యం గమక కళల్లో మేటి డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ కళా సేవలు చిరస్మరణీయం అని విశ్రాంత అధ్యాపకులు ఎన్.బసవరాజ్ తెలిపారు. రాఘవ కళా మందిరంలో రాఘవ మెమోరియల్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ 30వ వర్ధంతిలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. నాటకాలు, సాహిత్యం, గమక తదితర కళల్లో దొడ్డనగౌడ నైపుణ్యం అపారమైందన్నారు. దొడ్డనగౌడ మాతృమూర్తి రుద్రమ్మ, తండ్రి పంపనగౌడల కుమారుడిగా 1910 జూలై 27న జన్మించారు. జోళదరాశిలోని అయ్యన్నవర పాఠశాల, అలాగే గుడిబడిలో నాలుగవ తరగతి వరకు చదివారు. అనంతరం ఆయన నాటక రంగం సేవలకే అంకితం అయ్యారన్నారు. ఆంధ్ర సరిహద్దులోని ఈ ప్రాంతం కన్నడ, తెలుగు భాషలలో నాటకాల్లో అభినయించి సాహిత్య రచన కూడా చేపట్టి 40 గ్రంథాలను రచించారన్నారు. ముఖ్యంగా గమక కళకు ఆయన చేసిన సేవలు అజరామరం అన్నారు. బళ్లారి రాఘవచార్య శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. 1994 మే 10న ఆయన స్వర్గస్థులయ్యారని బసవరాజ్ తెలిపారు.
ఎండిన చెరువు.. చేపల మృత్యువు
ఎండిన చెరువు.. చేపల మృత్యువు
ఎండిన చెరువు.. చేపల మృత్యువు


