ఎన్‌కౌంటర్ కేసుపై సీఐడీ ఏడీజీపీ ఆరా
హుబ్లీ: నగరంలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13న 5 ఏళ్ల చిన్నారిని చెరబట్టి హత్య చేసిన కేసుకు సంబంధించి నిందితుడు రితేష్‌కుమార్ ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర సీఐడీ ఏడీజీపీ బీకే.సింగ్ నగరానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే సీఐడీ అధికారుల బృందం ఎస్పీ వెంకటేష్, ఏసీపీ శివప్రకాష్ ఆధ్వర్యంలో చురుగ్గా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగ్ సదరు అధికారులతో కేసు సమగ్ర వివరాలను సేకరించారు. అలాగే ఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటి కాంపౌండ్‌లో ఆటలాడుతున్న చిన్నారిని నిందితుడు చాక్లెట్ ఇస్తానని మభ్య పెట్టి ఎదురుగా ఉన్న షెడ్‌లోకి ఆ చిన్నారిని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా దారుణంగా హత్య చేసిన సంగతి విదితమే. అయితే నిందితుడిని వెంటబెట్టుకొని స్థల పరిశీలన చేసే క్రమంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మహిళా ఎస్‌ఐ అన్నపూర్ణ నిందితుడిని పారిపోవద్దు, లొంగిపొమ్మంటు హెచ్చరించి మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపినా పట్టించుకోక పోవడంతో నిందితుడి కాలిపైన, అలాగే వెన్నుపైన రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో నిందితుడు హతమైన విషయం తెలిసిందే. కాగా ఏడీజీపీ రాకతో కేసు దర్యాప్తు మరింత వేగాన్ని పుంజుకుంది.


