● ఏప్రిల్‌లో బృందం రాక
బనశంకరి: బెంగళూరులో మరో విమానాశ్రయం నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై అధ్యయనం కోసం భారతీయ విమానాశ్రయాల ప్రాధికార అధికారులు వస్తున్నారని భారీ పరిశ్రమలశాఖమంత్రి ఎంబీ.పాటిల్ తెలిపారు. శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య బెంగళూరులో పర్యటిస్తారు. ఫీజుల ఖర్చుల కోసం ప్రాధికారకు రూ.1.21 కోట్లు చెల్లించామని తెలిపారు. కనకపుర రోడ్డులో రెండు స్థలాలు, నెలమంగల, కుణిగల్ రోడ్డులో ఒక స్దలం గుర్తించామని తెలిపారు. ఈ స్థలాల రెవెన్యూ వివరాలు, పదేళ్ల వాతావరణ నివేదిక, భారతీయ సర్వేశాఖ బ్లూప్రింట్ తదితరాల సమాచారంతో నివేదిక సిద్ధంగా ఉంచామని తెలిపారు. బెంగళూరులో ఉండే కెంపేగౌడ విమానాశ్రయం పై ఒత్తిడి అధికంగా ఉందని, 2033 వరకూ 150 కిలోమీటర్లు పరిధిలో మరో విమానాశ్రయం ఉండరాదని షరతు ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రెండో విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటి నుంచి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
మండ్య: రైలు కింద పడి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండ్య నగరంలోని బందిగౌడ లేఔట్‌వద్ద శనివారం జరిగింది. మండ్యలోని రిజర్వు పోలీసు అన్సర్ బాషా కుమార్తె సుహాన (19) మృతురాలు. ఆమె మైసూరులోని ప్రైవేటు కాలేజీలో బీఏ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి స్కూటర్‌లో బయటకు వెళ్లింది. రైలు పట్టాల వద్దకు వెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో చిక్కాయి. చాముండి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. కారణాలు తెలియాల్సి ఉంది. మండ్య రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.