అరటి తోటలో పులి గర్జన
మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని బండీపుర అభయారణ్యం పరిధిలో బరగి సమీపంలోని ముక్తి కాలనీ వద్ద అరటి తోటలో పెద్ద పులి పట్టుబడింది. వివరాలు.. జిల్లాలో పులుల దాడుల సంఘటనలు పెరగడంతో, అటవీ శాఖ సిబ్బంది గుండ్లుపేట తాలూకాలోని భీమనబీడు, చామరాజనగర తాలూకాలోని నంజెదేవన్‌పుర పరిసరాల్లో గాలింపు జరుపుతున్నారు. శుక్రవారం భీమనబీడు గ్రామం వద్ద రెండు ఆవులు అరటి తోటలో మేస్తుండగా పులి దాడి చేసింది. ఒక ఆవు ముందు కాలును కరిచింది, మరొక ఆవు వెనుక కాలిని గాయపరిచింది. గత వారం రోజులుగా పులి మేకలను చంపి తింటోంది. పులిని పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
మత్తు మందు ఇచ్చి..
ఈ నేపథ్యంలో సోమవారం అరటి తోటలో పులి దాక్కున్నట్లు గుర్తించిన అటవీ సిబ్బంది దానిని వలలతో చుట్టుముట్టారు. మత్తు మందును తుపాకీ ద్వారా కొట్టారు. కొంతసేపటికి అది మత్తులోకి జారుకుంది. వెంటనే దానిని బంధించారు. పులి వయస్సు దాదాపు 7, 8 సంవత్సరాలు ఉంటుందని. పులి ఎద, వెనుక కాళ్ళపై గాయాలు ఉన్నాయని, మరో పులితో జరిగిన పోరాటంలో గాయపడి ఉండవచ్చని అటవీ అధికారులు తెలిపారు. అది కోలుకునేవరకు చికిత్స చేస్తారు. పులిని మైసూరు జూ కు తరలించినట్లు తెలిసింది.
వారంరోజులుగా గ్రామస్తులకు భయం
ఎట్టకేలకు నిర్బంధం
గుండ్లుపేట తాలూకాలో ఘటన
అరటి తోటలో పులి గర్జన


