జనవరి 15లోగా డీకే సీఎం: జ్యోతిష్యుడు
శివాజీనగర: సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి సీటు రగడ మొదటికొచ్చేలా ఉంది. ఇడ్లీ– దోసె, కోడికూర అల్పాహార విందు భేటీల తరువాత కాస్త చల్లారినట్లున్న వివాదం మళ్లీ తారాస్థాయికి చేరుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మధ్యలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేస్తున్న వ్యాఖ్యలు సమస్య తీవ్రతను మరింత పెంచేవిగా ఉంటున్నాయి. కుర్చీ పోట్లాటకు చరమగీతం పాడాలనే దిశలో హైకమాండ్ బలమైన చర్యలు తీసుకుంటోందా, లేదా అనే మీమాంస పార్టీలోనే నెలకొంది. గొడవ అనేది హైకమాండ్ సృష్టించలేదు, స్థానికంగానే తలెత్తింది అని ఖర్గే చెప్పడం ద్వారా కొత్త అనుమానాలను రేకెత్తించారు. ఇద్దరు నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడతామని అంతకుముందు చెప్పేవారు. ఖర్గే తాజా వ్యాఖ్యలు అన్ని లెక్కాచారాలను తలకిందులు చేసేలా ఉన్నాయని నాయకులు భావిస్తున్నారు.
సిద్దరామయ్య, డీకే వాగ్బాణాలు
ఇక జనవరి 5వ తేదీకి సిద్దరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసిన నేతగా రికార్డు సృష్టిస్తున్నారు. నేనే ఐదు సంవత్సరాలు పదవిలో ఉంటా, అధికార మార్పిడి చర్చలు జరగలేదని సీఎం సిద్దరామయ్య బెళగావి అసెంబ్లీలో ప్రకటించి డీకే శివ ఆశల మీద నీళ్లు చల్లారు. ఆ రోజు ఢిల్లీలో తమ మధ్య అధికార మార్పిడి ఒప్పందం జరిగిందని డీకే మళ్లీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల మధ్య వారిద్దరే గొడవను పరిష్కరించుకోవాలని ఖర్గే చెప్పడం ద్వారా బంతిని బెంగళూరు మైదానానికి పంపించారు. ఖర్గే వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో భిన్న భావాలు ఏర్పడ్డాయి. సిద్దరామయ్య వర్గంలో సంతోషం, డీకే శిబిరంలో కలవరం నెలకొంది. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలతో మాట్లాడాలని డీకే నిశ్చయించినట్లు సమాచారం.
నేడు ఢిల్లీకి డీసీఎం శివ
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీకి వెళ్తారు. గత 10 రోజుల్లో హస్తినకు వెళ్లడం ఇది రెండవసారి. హైకమాండ్ నేతలు తమ ఇద్దరితో ఓ విషయం చెప్పారని, దాని గురించి ఢిల్లీకి వెళ్లి చర్చించి పరిష్కరించుకుంటామని డీకే ఇటీవల తెలిపారు. ఢిల్లీలో శివకుమార్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరవుతారు. కేంద్రజలశక్తి మంత్రి సీఆర్.పాటిల్ నేతృత్వంలో జరిగే నదుల అనుసంధానం సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రనీటి ప్రాజెక్టులకు, మెట్రో రైలు పథకానికి 50 శాతం నిధుల సాయం కోరనున్నారు. కాగా డీకేను కేపీసీసీ పదవి నుంచి తొలగించాలని, మరికొందరు డిప్యూటీ సీఎంలను నియమించాలని సిద్దరామయ్య ఆప్త మంత్రులు, ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేస్తున్నారు. ఎత్తు, పై ఎత్తులతో రాష్ట్ర కాంగ్రెస్‌లో సెగ రాజుకుంది.
సీఎం, డీసీఎంలే తేల్చుకోవాలన్న
ఖర్గే వ్యాఖ్యలతో అంతా తారుమారు
హైకమాండ్ పట్టించుకోదా? అనే
సందేహాలు
మైలారిలో సీఎం అల్పాహారం
మైసూరు: మైసూరులో సీఎం సిద్దు టీకే లేఔట్‌లోని తన నివాసం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పరిష్కారానికి హామీ ఇచ్చారు. తరువాత, అగ్రహారలో మైలారి హోటల్‌కు వెళ్లి దోసె, ఇడ్లీ అల్పాహారం ఆరగించారు. ఆయన వెంట మంత్రి వెంకటేష్, ఎమ్మెల్యే డి.రవిశంకర్, కలెక్టరు లక్ష్మీకాంత్ రెడ్డి, పోలీసు కమిషనర్ సీమా తదితరులు ఉన్నారు.
బనశంకరి: జనవరి 15 లోగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని, మంత్రి సతీశ్ జార్కిహొళి కేపీసీసీ చీఫ్ అవుతారని సోమవారం బబలేశ్వర జ్యోతిష్యుడు ఉల్లాస్ జోషి చెప్పారు. దీనిని రాఘవేంద్రస్వామి తన నాలుక నుంచి పలికించారన్నారు. సమస్య గురించి జపం చేస్తూ రాఘవేంద్రస్వామికి నివేదిస్తానని, ఇందుకు స్వామివారు సమాధానం ఇస్తారని చెప్పారు. ఎంతోమందికి జాతకాలు చెప్పానని, ఏదీ అబద్ధం కాలేదన్నారు. జనవరి 15లోగా డీకే కుర్చీలో ఆసీనులవుతారన్నారు. ఈ జోస్యం రాజకీయాల్లో చర్చ రేకెత్తించింది.
జనవరి 15లోగా డీకే సీఎం: జ్యోతిష్యుడు
జనవరి 15లోగా డీకే సీఎం: జ్యోతిష్యుడు
జనవరి 15లోగా డీకే సీఎం: జ్యోతిష్యుడు


