అయోధ్యకు స్వామీజీ రైలు యాత్ర
మైసూరు: గణపతి సచ్చిదానంద స్వామి వేలాది మంది భక్తులతో మైసూరు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన రైల్వే స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ, అయోధ్యలో కర్ణాటక దత్త పీఠానికి స్థలం కేటాయించారని తెలిపారు. దత్త పీఠం శాఖను ప్రారంభించి, రామ పరివార్ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి తాను అక్కడికి వెళ్తున్నానని చెప్పారు. కర్ణాటక హనుమంతుని భూమి. హంపిలోని కిష్కింధలో హనుమంతుడు అవతారం ఎత్తిన ప్రదేశం, కాబట్టి, రాముడు, కర్ణాటక మధ్య ప్రత్యేక సంబంధం ఉంది అని స్వామీజీ వివరించారు.
కిచ్చ సుదీప్ వర్సెస్ దర్శన్
శివాజీనగర: హుబ్లీలో జరిగిన మార్క్ సినిమా ఈవెంట్ లో నటుడు కిచ్చ సుదీప్ మాట్లాడిన మాటలు చర్చకు కారణమయ్యాయి. సుదీప్ ఎవరి పేరును ఎత్తకున్నా, దర్శన్ గురించే అని దిబాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ సతీమణి విజయలక్ష్మి కూడా ఎవరి పేరును చెప్పకుండా సుదీప్‌పై విమర్శలు గుప్పించారు. కొందరు దర్శన్ లేకపోవడంతో ఏదేదో మాట్లాడుతున్నారు, వేదికపై నిలబడి మాట్లాడటం, వీడియోల్లో కూర్చొని మాట్లాడటం, బయట మాట్లాడటం చేస్తున్నారు. అదే జనం దర్శన్ ఉన్నప్పుడు బెంగళూరులో ఉంటారో, లేదో కూడా తెలియదు అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక అభిమానులు సుదీప్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. సుదీప్ మార్క్ సినిమా ప్రచారం కోసం జిమ్మిక్కులు చేస్తున్నాడని వారు మండిపడ్డారు.
పేలుడు కేసంటూ..
రూ.5 లక్షలు స్వాహా
దొడ్డబళ్లాపురం: సైబర్ నేరగాళ్లు రూ. 5 లక్షలకు పైగా స్వాహా చేశారని శరణ్ ఆర్ ముకుంద్ అనే కన్నడిగుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వివరాలు.. ఆయనకు కాల్ చేసిన వ్యక్తి ఏటీఎస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో మీ హస్తం ఉందని, విచారించాలని బెదిరించాడు. ఏ తప్పూ చేయలేదని చెప్పినా వినిపించుకోలేదు. తరువాత ఐపీఎస్ అధికారి గౌరవ్ పేరుతో ఒక వ్యక్తి మాట్లాడి వీడియో కాల్‌లోనే విచారణ పేరుతో ప్రశ్నలు వేశాడు. బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకున్నాడు. ఈ కేసు బయటపడాలంటే ఓ సర్టిఫికెట్ మంజూరు చేయాలి, ఖర్చవుతుందని చెప్పాడు. అలా రూ.5.53 లక్షలు బదలాయించుకున్నారు. తరువాత మోసం అని తెలుసుకుని 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
చిన్నస్వామిలో
మ్యాచ్‌లపై సమీక్ష
శివాజీనగర: ఇటీవల ప్రాణాంతకమైన తొక్కిసలాట జరిగిన బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే విషయం పరిశీలనకు కమిటీని నియమించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. సోమవారం విధానసౌధలో క్రికెట్ సంఘం అధికారులు, పోలీసు అధికారులతో ఆయన భేటీ జరిపారు. 24న విజయ్ హజారె టోర్నీ జరపడానికి క్రికెట్ సంఘం అనుమతి కోరిందన్నారు. జీబీఏ కమిషనర్ నేతృత్వంలో పలు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామని, స్టేడియాన్ని పరిశీలించి మార్పులు చేర్పుల గురించి ప్రభుత్వానికి నివేదికను ఇస్తుందని, దానిని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
రూ.5 వేల కోట్లు
ఏమయ్యాయి?: కుమార
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో మహిళల ఖాతాల్లోకి జమ కావాల్సిన రెండు నెలల గృహలక్ష్మి పథకం డబ్బులు రూ.5000 కోట్లు ఏమయ్యాయంటూ కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సర్కారును ప్రశ్నించారు. హాసన్‌లో సోమవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన మార్చ్, ఏప్రిల్ నెలలకు మహిళలకు ఇవ్వాల్సిన గృహలక్ష్మి డబ్బులు ఉన్నాయా, ఉందా లేదా అన్నారు. ఆర్థికమంత్రి అయిన సీఎం సిద్ధరామయ్య జవాబు చెప్పాలన్నారు. రూ.5 వేల కోట్లు మిస్సింగ్ అంటే మామూలు విషయం కాదన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించి రాజీనామా చేస్తారని ప్రశ్నించారు.


