దొడ్డబళ్లాపురం: కావేరి నది జలాలు కలుషితం కాకుండా మరియు కావేరి నది పరివాహక ప్రాంతాలు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తామని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. కొడగు జిల్లా శ్రీ భగండేశ్వర ఆలయం, కావేరి, సుజ్యోతి, కన్నికా నదుల త్రివేణి సంగమం, తలకావేరిలో డీసీఎం డీకే శివకుమార్ శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర తీర్థాన్ని తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కావేరి నది జలాలు,నేల,చరిత్ర,సంస్కృతి సంరక్షణకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని, అందుకు మీడియా వారు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. విశ్వ జల దినోత్సవం నేపథ్యంలో వారం రోజులపాటు జల సంరక్షణ అభియాన్ జరుగుతుందన్నారు. కావేరికి హారతి కార్యక్రం ఉద్దేశం ఇదే అన్నారు. ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు తాను,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతామని తెలిపారు.