రమణీయం హంసవాహనం | - | Sakshi
Sakshi News home page

రమణీయం హంసవాహనం

Published Tue, Mar 18 2025 12:29 AM | Last Updated on Tue, Mar 18 2025 12:26 AM

బొమ్మనహళ్ళి: బెంగళూరు బొమ్మనహళ్ళిలో అగరలో వెలసిన శ్రీనివాసుని ఆలయం బ్రహ్మ రథోత్సవం వేడుకలలో భాగంగా ఆదివారం రాత్రి హంస వాహన సేవ రమణీయంగా సాగింది. స్థానిక యాదవ కుల పెద్దలు స్వామివారికి పూజలు నిర్వహించారు. హంసవాహనంపై స్వామివారిని ఆసీనుల్ని చేసి పురవీధుల్లో ఊరేగించారు. అంతకుముందు అర్చకులు చంద్రమౌళి ఆధ్వర్యంలో కలశ పూజలు, యజ్ఞ హోమాలను నిర్వహించారు.

బార్‌ ఉద్యోగిపై

కాంగ్రెస్‌ నేత దాడి

యశవంతపుర: రాత్రి సమయంలో మద్యం అమ్మలేదనే కోపంతో బార్‌ క్యాషియర్‌పై దాడి చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా కొప్పలో జరిగింది. కొప్ప బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విజయానంద అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో స్నేహితుడు కాశ్విక్‌తో కలిసి బార్‌ వద్దకు వెళ్లాడు. మద్యం బాటిళ్లు ఇవ్వాలని క్యాషియర్‌ను డిమాండ్‌ చేశారు. ఇప్పుడు అమ్మకూడదని అతడు చెప్పాడు. దీంతో సోమవారం ఉదయం వెళ్లి క్యాషియర్‌ను చితకబాదాడు. సీసీ కెమెరాలలో ఈ వైనం రికార్డయింది. క్యాషియర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

మంకీ ఫివర్‌తో మహిళ మృతి

దొడ్డబళ్లాపురం: చిక్కమగళూరు జిల్లా మంకీ ఫివర్‌ వ్యాపిస్తోంది. జిల్లాలోని ఎన్‌ఆర్‌ పుర తాలూకా కట్టినమనె గ్రామం నివాసి 65 ఏళ్ల మహిళ బలైంది. ఈమె మేల్పాల్‌ గ్రామంలోని ఒక కాఫీ తోటలో పని చేస్తోంది. కొన్నిరోజుల క్రితం ఈమెకు కోతి జ్వరం సోకింది. కొప్ప ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండేది. అయితే ఆరోగ్యం విషమించి చనిపోయింది. ఈ ఏడాదిలో మొదటి మంకీ ఫివర్‌ మృతిగా నమోదయ్యింది. జిల్లాలో ఇంకా 50 మంది ఈ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు.

27న బీబీఎంపీ బడ్జెట్‌

బనశంకరి: గత ఐదేళ్లుగా కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగక, ప్రజాప్రతినిధులు లేని బీబీఎంపీలో ఈ నెల 27 తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల సీఎం సిద్దరామయ్య రాష్ట్ర బడ్జెట్‌లో బీబీఎంపీకి రూ.7 వేల కోట్లు నిధులు ప్రకటించారు. పాలికె బడ్జెట్‌ సుమారు రూ.15 వేల కోట్లతో ఉండవచ్చని అంచనా. పాలికె ఆర్థిక శాఖ ప్రత్యేక కమిషనర్‌ హరీశ్‌కుమార్‌ 2025–26 బడ్జెట్‌ను ప్రకటిస్తారు. ఇందుకు నగరాభివృద్ధి మంత్రి, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ ఆమోదించారని బీబీఎంపీ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ తెలిపారు. ఈసారి రోడ్లు, మంచినీరు, ముంపు నివారణ వంటి మౌలిక సౌకర్యాలకు పెద్దపీట వేస్తారని తెలిసింది.

మైసూరు మహిళకు

రూ.72 లక్షల టోపీ

మైసూరు: షేరు మార్కెట్‌లో తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి మహిళ నుంచి రూ. 72.60 లక్షలను కొట్టేశారు సైబర్‌ నేరగాళ్లు. ఈ తరహా నేరాలు తరచూ జరిగే మైసూరులోనే ఈ మోసం కూడా చోటుచేసుకుంది. వివరాలు.. మైసూరు నగరంలోని గోకులంలో ఉంటున్న మహిళకు ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే దండి లాభాలు వస్తాయని ఆమెను నమ్మించాడు. ఓ యాప్‌ను ఆమెకు పంపించాడు సరేనని ఆమె మొదటిసారి ఆ యాప్‌ ద్వారా కొంత నగదు పంపింది. కొన్నిరోజుల్లోనే రెట్టింపు లాభం వచ్చినట్లు చూపించారు. ఆపై ఆమె రూ. 72.60 లక్షలను పెట్టుబడి పెట్టింది. తరువాత అవతల వ్యక్తి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మునిగిపోయినట్లు గ్రహించి సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది.

అమెరికాలో రామనగర విద్యార్థి మృతి

దొడ్డబళ్లాపురం: ఉన్నత చదువుల కోసం వెళ్లిన రామనగర యువకుడు అమెరికాలో మృతిచెందిన సంఘటన వెలుగు చూసింది. రామనగర పట్టణ పరిధిలోని రాఘవేంద్రస్వామి కాలనీ నివాసి అనంతక్రిష్ణ కుమారుడు శుభాంగ్‌ (27), 10 నెలల క్రితం ఎంఎస్‌ చదవడానికి అమెరికాకు వెళ్లాడు. ఓ కాలేజీలో చదువుకుంటున్నారు. రాత్రి భోజనం తిని పడుకున్న శుభాంగ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మరణించాడని కుటుంబానికి సమాచారం వచ్చింది. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. త్వరగా మృతదేహాన్ని తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement