జిల్లా బీజేపీ అధ్యక్షుల నియామకం | - | Sakshi
Sakshi News home page

జిల్లా బీజేపీ అధ్యక్షుల నియామకం

Mar 16 2025 12:32 AM | Updated on Mar 16 2025 12:29 AM

రాయచూరు రూరల్‌: జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వీరనగౌడ పాటిల్‌ను నియమించారు. ఈమేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర శుక్రవారం ఒక ప్రకటన వెలువరించారు. రాయచూరు ఎమ్మెల్యేగా ఉన్న శివరాజ్‌ పాటిల్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి వీరనగౌడ పాటిల్‌కు పీఠాన్ని కట్టబెట్టారు. ఇక యాదగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అమీన్‌ రెడ్డి, బీదర్‌ జిల్లా అధ్యక్షుడిగా సోమనాథ పాటిల్‌, కలబుర్గి జిల్లా అధ్యక్షుడిగా చంద్రకాంత్‌ పాటిల్‌, కొప్పళ్‌ జిల్లా అధ్యక్షుడిగా నవీన్‌ గుళగణ్ణనవర్‌, బాగల్‌కోట జిల్లా అధ్యక్షుడిగా శాంతనగౌడ పాటిల్‌, విజయపుర జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఆర్‌.ఎస్‌.పాటిల్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో జరగనున్న జెడ్పీ, టీపీ, నగరసభ ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తలను సమాయత్తం చేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.

తల్లి వెంటే జైలుకు పసిబిడ్డ

బళ్లారిఅర్బన్‌: ప్రసవించిన 14 రోజులకే అనివార్య కారణాలతో రూ.60 వేలకు విక్రయమైన ఏడాది వయస్సు ఉన్న పసిబిడ్డ ప్రస్తుతం తల్లితో పాటు జైలు చేరిన విషాద ఘటన నగరంలో వెలుగు చూసింది. గౌతం నగర్‌ నివాసి యల్లమ్మ (27) గత ఏడాది ఫిబ్రవరిలో బీఎంసీఆర్‌సీలో పసిబిడ్డకు జన్మనిచ్చింది. ఈమె భర్త చనిపోయాడు. తనకు ఆ బిడ్డ వద్దని రూపనగుడి రోడ్డు నివాసి నవీన్‌కుమార్‌ (49)కు రూ.60 వేలకు పసిబిడ్డను విక్రయించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలల రక్షణ శాఖ సహాయవాణికి గత ఆగస్ట్‌ 5న సమాచారం రావడంతో వారు బళ్లారి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి పసిబిడ్డను ఆంధ్రప్రదేశ్‌లోని ఆలూరు నుంచి తీసుకొచ్చారు. బిడ్డను కొనుగోలు చేసిన నవీన్‌కుమార్‌, విక్రయించిన బిడ్డ తల్లి యల్లమ్మను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ బిడ్డను బళ్లారి జైల్లో ఉన్న సొంత తల్లి వద్దకే చేర్చారు. ఈ కేసులో విక్రయించిన, కొనుగోలు చేసిన వారికి 10 ఏళ్ల శిక్ష ఉంటుంది. కోర్టులో నేరం రుజువైతే తల్లితో పాటు బిడ్డ కూడా శిక్ష అనుభవించాలా? లేక బాలల రక్షణ శాఖలోని అమ్మ ఒడి ఆశ్రమంలో ఉంటుందా? అనే సందేహం తలెత్తుతోంది. కాగా తల్లి వద్దు అనుకున్న బిడ్డను సంతానం లేని దంపతులు గత ఏడాది నుంచి పెంచి పోషించి తల్లి ప్రేమకు నోచుకొనేలా చేసిన ఆ తల్లిదండ్రులకే దత్తత ఇస్తే బాగుంటుందని సమాజ శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు.

బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందే

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీలు దొందూ దొందే అని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు. శనివారం ఏపీఎంసీ సభా భవనంలో నవ కర్ణాటక నిర్మాణ ఆందోళన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాలు పోరాటంలో ఏకతాటిపై ముందుకు సాగాలన్నారు. బసవాది శరణులు చూపిన బాటలో మనం పయనించాలన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ప్రజలను గ్యారెంటీల పేరుతో మోసం చేస్తున్నాయన్నారు. ఆర్పీఐ అధ్యక్షుడు మోహన్‌ రాజ్‌, పుట్టరాజ్‌, హనుమంతప్ప, బసవరాజ్‌, నరసప్ప, ఈరణ్ణ, రాజు పట్టి, అయ్యప్ప, లక్ష్మీ, దేవకి, శ్రీకాంత్‌లున్నారు.

మా కుటుంబానికి

న్యాయం చేయండి

వయోవృద్ధుని వేడుకోలు

బళ్లారిఅర్బన్‌: తమపై కుటుంబ సభ్యులతో పాటు ఇతరులు అన్యాయంగా నడుచుకుంటూ, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ మానసికంగా వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని వయోవృద్ధుడు వీ.ఈరణ్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పత్రికా భవనంలో మీడియా సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కట్టడ నిర్మాణ కార్మికుడిగా సొంత సంపాదనతో దేవినగర్‌లో 5 ఇళ్లు నిర్మించుకున్నానన్నారు. చాగనూరులో 4 ఎకరాల పొలం తీసుకున్నానన్నారు. తనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలున్నారన్నారు. అయితే ఆస్తుల పంపకం విషయంలో పిల్లల నిర్లక్ష్యం వల్ల తాను ప్రస్తుతం కోట ప్రాంతంలో కార్పొరేషన్‌ నిర్వహిస్తున్న నిరాశ్రితుల కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నానన్నారు. ముందుగా అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు చిన్నగా ప్రారంభమైన కుటుంబ కలహాలు అనంతరం కుమారులు పురుషోత్తం, వాసులకు పెళ్లి అయిన తర్వాత ఆస్తుల కోసం పరస్పర దాడులతో పాటు పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించేలా చేసిందన్నారు. గత మూడేళ్ల నుంచి అన్నదమ్ములు, సోదరీమణులు రెండు వర్గాలుగా ఏర్పడి పరస్పరం కొట్లాడుకుంటూ తనకు తీరని ఆవేదన కల్గించి వీధి పాలు చేశారని ఆయన వాపోయారు. అందరూ ఒక్కటై ఆస్తి కోసం ఇంటి నుంచి బయటకు వేశారన్నారు. తాను కష్టపడి నిర్మించుకున్న ఇంట్లో ఉండటానికి తక్షణమే పోలీస్‌ ఉన్నతాధికారులు సహాయం చేసి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఈరణ్ణ జిల్లా ఎస్పీ శోభారాణికి విజ్ఞప్తి చేశారు.

జిల్లా బీజేపీ అధ్యక్షుల నియామకం1
1/3

జిల్లా బీజేపీ అధ్యక్షుల నియామకం

జిల్లా బీజేపీ అధ్యక్షుల నియామకం2
2/3

జిల్లా బీజేపీ అధ్యక్షుల నియామకం

జిల్లా బీజేపీ అధ్యక్షుల నియామకం3
3/3

జిల్లా బీజేపీ అధ్యక్షుల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement