
కారదపొడి మహేష్(ఫైల్)
హొసపేటె: కులం పేరుతో దూషణ ఆరోపణలపై మున్సిపల్ కౌన్సిలర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైన ఘటన మంగళవారం జరిగింది. వివరాలు..తమ వార్డులో తాగునీటి సమస్యపై మున్సిపల్ కమిషనర్‌తో చర్చించిన విషయంపై కౌన్సిలర్ కారదపుడి మహేష్ తనను పరుష పదజాలంతో దూషిస్తూ అవమానించి మాట్లాడారని ఆరోపిస్తూ నగర వాసి, వాల్మీకి సమాజానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి కుల దూషణ చట్టం కింద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు టౌన్ పోలీసులు తెలిపారు.
అప్పుల బాధ తాళలేక
రైతు ఆత్మహత్య
కంప్లి: అప్పుల బాధ తాళలేక విషం తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కురుగోడు పరిధిలోని బాదనహట్టిలో జరిగింది. గ్రామానికి చెందిన పోతప్పనకట్టె 4వ వార్డులో నివాసముంటున్న బసాపుర పెన్నయ్య(35) అనే వాల్మీకి సముదాయానికి చెందిన రైతు తన 3 ఎకరాల పొలంలో మిరప సాగు చేశాడు. అయితే వర్షాలు కరువై పంటకు నీరు లేక నష్టపోయాడు. పంట సాగు కోసం క్రిమినాశక మందులు, ఎరువులు, విత్తనాలకు భార్య నీలమ్మ పేరిట బ్యాంకుల్లో రూ.1.20 లక్షలు రుణం తీసుకున్నాడు. అంతేగాకుండా ఊరిలో రూ.5 లక్షలు అప్పు చేశాడు. అయితే పంట నష్టం సంభవించడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక జీవితంపై విరక్తి చెంది విషం తాగాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను బళ్లారి విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెన్నయ్యకు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కురుగోడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రైతు పెన్నయ్య(ఫైల్)