
విక్టోరియాలో విషమ పరిస్థితిలో బాలిక
శివాజీనగర: బడిలో నాణ్యత లేని మధ్యాహ్న భోజనం, సిబ్బంది అలసత్వం వంటి ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ఇదే రీతిలో సిబ్బంది నిర్లక్ష్యానికి బిసి ఊట సాంబారు పాత్రలో పడి తీవ్రంగా గాయపడిన రెండో తరగతి బాలిక ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. వివరాలు.. ఈ నెల 16న కల్బుర్గి జిల్లా అఫ్జల్‌పుర తాలూకా చిణమగేరా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం సిద్ధం చేసిన సాంబారు పాత్రలో మహంతమ్మ (8) అనే విద్యార్థిని పడిపోయింది. సాంబారు వేడితో మసులుతుండగా, పాపకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. కల్బుర్గి బసవేశ్వర ఆసుపత్రిలో ముందుగా చికిత్స చేసి, బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఒంటిపై యాభై శాతం పైగా కాలిన గాయాలు ఉండగా, పరిస్థితి విషమించి బాలిక చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. దీంతో అప్పటివరకు కూతురు ఆరోగ్యంగా తిరిగి వస్తుందని అనుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనికి బిసి ఊట సిబ్బంది నిర్లక్ష్యం కారణమని బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్‌ఎం, టీచర్ సస్పెండ్
ఈ సంఘటనలో నిర్లక్ష్యం వహించారని పాఠశాల హెడ్‌మాస్టర్ లాల్‌బి నదాఫ్, ఉపాధ్యాయుడు రాజు చౌహాన్‌లను కల్బుర్గి డీడీపీఐ సక్రప్పగౌడ బిరాదార సస్పెండ్ చేశారు. వంటమనిషి కస్తూరిబాయి తళకేరిని పని నుంచి తీసేశారు.
సాంబారులో పడిన బాలిక
మూడు రోజులు
మృత్యువుతో పోరాడి మృతి

మొదట గాయాలతో బాలిక మహంతమ్మ