శివమొగ్గ : వినాయక చవితి, ఈద్ మిలాద్ పండుగల ఊరేగింపుల సమయంలో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా శికారిపుర పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. శుక్రవారం రౌడీషీటర్లతో పెరేడ్ నిర్వహించారు. డీసీపీ శివానదం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిపై ఉన్న కేసులపై ఆరా తీశారు. నేరాలకు దూరంగా ఉంటూ జనజీవన శ్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. ఎలాంటి గొడవలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అన్నదాత ఆత్మహత్య
మైసూరు: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైసూరు జిల్లా పిరియా పట్టణ తాలూకా లక్ష్మీపురలో జరిగింది. గ్రామానికి చెందిన శివలింగయ్య కుమారుడు స్వామి(38) తనకున్న 3.5 ఎకరాల్లో మొక్కజొన్న, అల్లం పంట సాగు చేయడానికి వ్యవసాయ పరపతి సహకార బ్యాంకులో రూ.3.70 లక్షల వరకు అప్పు చేశాడు. సాగు చేసిన పంటలు చేతికందలేదు. అప్పులు తీర్చే మార్గం కనిపించక స్వామి తన ఇంటిలోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బైలకుప్పె పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
మహనీయులకు ఘన నివాళి
మండ్య: తాలూకాలోని హొళలు గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సర్.ఎం.విశ్వేశ్వరయ్య జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య, నాల్వడి కృష్ణరాజ ఒడెయార్, హెచ్.డి.చౌడయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్.ఎం.విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. డెయిరీ అధ్యక్షుడు ఉమేశ్ స్వీట్లు పంపిణీ చేశారు.
కావేరి రక్షణ యాత్ర
యశవంతపుర: కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయటాన్ని ఖండిస్తూ నదీ పరివాహక ప్రాంత తాలూకాలలో కావేరి రక్షణ యాత్రను చేపట్టనున్నట్లు మాజీ సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. శుక్రవారం మాజీ సీఎం యడియూరప్ప పార్టీ నాయకులతో కలిసి చర్చించారు. కావేరి విషయంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపించారు. నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టుకు సరైన సాక్ష్యాలను ఇవ్వని కారణంగా ఈ సమస్య వస్తోందన్నారు. కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయటాన్ని వ్యతిరేకిస్తూ యాత్ర చేస్తామన్నారు. కావేరి పరివాహక ప్రాంతలో సాగు చేసిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.25 వేలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
న్యూస్‌రీల్
రౌడీలను హెచ్చరిస్తున్న పోలీసులు


