
కర్ణాటక: మహిళపై ఒక నెమలి పదేపదే దాడి చేస్తుండడంతో విసిగిపోయిన ఆమె నెమలిపై చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటన చెన్నపట్టణ తాలూకా అరళాళుసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం నివాసి లింగమ్మ బాధితురాలు.
ఇంటి వద్ద తాను పనిచేసుకుంటుండగా ఒక నెమలి తరచూ ఎగురుకుంటూ వచ్చి తనను ముక్కుతో పొడుస్తూ గాయపరుస్తోందని, ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా తీసుకుంటున్నానని అందువల్ల నెమలిని పట్టుకుని తనకు రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. రామనగర జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుత దాడులతో ఇప్పటికే విసిగిపోయిన ప్రజలకు నెమళ్లు కూడా దాడి చేస్తుండడం కలవరపెడుతోంది.