సాక్షి,బళ్లారి: అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా ఈత నేర్చుకునేందుకు నేటికీ భయపడేవారు ఎందరో ఉన్న నేటి రోజుల్లో 2014లో జరిగిన బస్సు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న గోపిచంద్ అనే 19 ఏళ్ల యువకుడు అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీల్లో రాణించి తన ప్రతిభను చాటాడు. శారీరక వైకల్యం ఉన్నా, ధైర్యం, కృషి, పట్టుదల, సాధించాలనే సంకల్పం, లక్ష్యం ముందు వైకల్యం తలవంచింది. దీంతో గోపిచంద్ అనే దివ్యాంగుడు తనదైన శైలిలో దివ్యాంగుల ఈత పోటీల్లో రాణించి బళ్లారి జిల్లాకు ఖ్యాతిని తెచ్చాడు. బళ్లారి జిల్లా సండూరు తాలూకా దరోజీ గ్రామానికి చెందిన రాజశేఖర్, వసంత దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా గోపిచంద్ ప్రమాదవశాత్తు బస్సు కింద పడిపోవడంతో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు.
ఫలించిన కోచ్ రజనీలక్కా శిక్షణ
అయితే జీవితంపై నిరుత్సాహం చెందకుండా, తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన ఈతలో రాణించేందుకు అడుగులు వేశాడు. ఈ క్రమంలో బళ్లారికి చెందిన ప్రముఖ స్మిమింగ్ కోచ్ రజనీ లక్కాను సంప్రదించిన గోపిచంద్ 2016 నుంచి ఈతలో తనదైన శైలిలో రాణించేందుకు కృషి చేశాడు. ఏటేటా ఈత పోటీల్లో తన ప్రతిభను చాటుతూ దేశ, విదేశాల్లో వివిధ ప్యారా స్విమ్మింగ్ పోటీల్లో రాణించాడు. అస్ట్రేలియాలో 2026 ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు జరిగిన అంతర్జాతీయ స్మిమ్మింగ్ పోటీల్లో రాణించి సిల్వర్ మెడల్‌ను సాధించాడు. ఇప్పటి వరకు 60 గోల్డ్‌మెడల్స్, 13 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. శ్రీలంక, బహ్రైన్, కై రో, కొరియా, చైనా, స్పెయిన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్యారా స్మిమ్మింగ్ పోటీల్లో రాణించి బళ్లారికి ఖ్యాతి తెచ్చారు.
భవిష్యత్తులో మరింతగా రాణించాలి
స్విమ్మింగ్ కోచ్ రజనీ లక్కా మాట్లాడుతూ తన వద్ద స్విమ్మింగ్ నేర్చుకున్న గోపిచంద్ అంతర్జాతీయ స్థాయిలో రాణించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇంకా భవిష్యత్తులో ఏషియన్ గేమ్స్, ఒలంపిక్స్‌లో జరిగే ప్యారా స్మిమింగ్ పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. స్విమ్మింగ్‌లో రాణించిన గోపిచంద్ మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారం, ముఖ్యంగా స్విమ్మింగ్ కోచ్ రజనీ లక్కా ఈతలో రాణించేందుకు ఎంతో తోడ్పాటునందించారన్నాడు. ఈత ఎలా కొట్టాలి, ఎలా విజేతగా నిలవాలి తదితర మెలకువలు నేర్పించారన్నారు. ప్రస్తుతం ఏషియల్ గేమ్స్, ఒలంపిక్స్‌లో జరిగే ప్యారా స్మిమింగ్ పోటీల్లో రాణించేందుకు బెంగళూరుకు చెందిన శరత్ గైక్వాడ్ వద్ద కూడా శిక్షణ పొందుతున్నానన్నారు. కాగా ఈతలో అసాధారణ ప్రతిభ చూపుతున్న గోపిచంద్‌ను జిల్లాలోని పలువురు ప్రముఖులు అభినందించారు.
ఈత కొట్టడంలో దిట్ట గోపిచంద్
అంతర్జాతీయ పోటీల్లో రాణించిన వైనం


