వృద్ధుడు దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడు దారుణ హత్య

Mar 15 2026 1:26 AM | Updated on Mar 15 2026 1:26 AM

అక్రమ సంబంధం వల్లే హత్యగా అనుమానం

యాదగిరి జిల్లా వడగేరా తాలూకాలో ఘటన

సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్‌ : అక్రమ సంబంధం కారణంగా ఓ వృద్ధుడు దారుణహత్యకు గురైన ఘటన యాదగిరి జిల్లా వడగేరా తాలూకా గోనాళ్‌ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన హంపన్న సజ్జన్‌(76) అనే వృద్ధుడు తన పొలంలో ఉండగా, గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్‌ కథనం ప్రకారం హతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. 12 ఏళ్ల క్రితం భార్య చనిపోగా, తన పొలంలో ఇల్లు నిర్మించుకుని ఒంటరిగా జీవిస్తుండేవాడు. ముగ్గురు కుమారులకు కూడా భూములు తదితర ఆస్తులను పంచి పెట్టాడు. ఒంటరిగా జీవిస్తున్న తరుణంలో రాత్రి తోటలో పడుకుని ఉదయమే గ్రామంలోకి పాలు పోయించుకునేందుకు వచ్చేవాడని, శుక్రవారం రాకపోవడంతో అనుమానం వచ్చి తోటలో పరిశీలించగా, రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారన్నారు. వృద్ధుడు ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతోనే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వడగేరా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మడివాళలను ఎస్సీల్లో చేర్చాలి

రాయచూరు రూరల్‌: మడివాళ(రజక) సమాజాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని మడివాళ మాచిదేవ సమాజం జిల్లాధ్యక్షుడు జంబన్న డిమాండ్‌ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1922ల్లో మైసూరు రాజులు ఎస్సీల్లో చేర్చిన 18 రాష్ట్రాల్లో అమలులో ఉందన్నారు. 15 ఏళ్ల క్రితం కుల శాస్త్ర అధ్యయనం ప్రకారం నివేదిక అందించిన అన్నపూర్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వద్దకు వెళుతున్నట్లు తెలిపారు. నరసప్ప, ఉసేనప్ప, మల్లేష్‌, శాంతప్ప, ఆంజనేయ, నాగేష్‌, నందలున్నారు.

పాఠశాలలో పాము కాటు

అస్వస్థతకు గురైన విద్యార్థిని, ఉపాధ్యాయుడు

చెళ్లకెరె రూరల్‌: చిత్రదుర్గ తాలూకా హుణసెకట్టె గ్రామ పాఠశాల ప్రాంగణంలో 6 సంవత్సరాల వయస్సుగల 1వ తరగతి విద్యార్థిని సృష్టిని నాగుపాము కాటు వేసింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాఠశాల ఉపాధ్యాయుడు రవిశంకర్‌ నోటి ద్వారా విషం బయటకు తీయడానికి ప్రయత్నించగా అతను కూడా అనారోగ్యానికి గురయ్యాడు. విద్యార్థిని సృష్టిని ప్రైవేట్‌ ఆస్పత్రికి, ఉపాధ్యాయుడు రవిశంకర్‌ను చికిత్స కోసం చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

దేశానికి వెన్నెముక రైతన్న

రాయచూరు రూరల్‌: రైతన్న దేశానికి వెన్నెముక లాంటివారని కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్య అన్నారు. శనివారం నగరంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతులు పొలంలో కష్టపడి పని చేసే సమయంలో వారు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ముందు జాగ్రత్తల్లో భాగంగా ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. గుండెపోటు, మూత్ర పిండాలు, కీళ్ల వ్యాధులు, క్యాన్సర్‌, మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలను బెంగళూరు నుంచి వైద్యులను తీసుకొచ్చి సేవలు చేయడం ప్రశంసనీయమన్నారు. లక్ష్మీకాంత్‌ పాటిల్‌, ఇంద్రజిత్‌, మల్లికార్జున, మహదేవ్‌, ముజాహిద్‌లున్నారు.

చెరువులో యువకుడి శవం

రాయచూరు రూరల్‌: చెరువులో అనుమానాస్పద రీతిలో యువకుడి శవం లభించిన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకా అలబనూరులో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి దేవి జాతరకు వచ్చిన 18 ఏళ్ల యువకుడు శనివారం స్నానానికి వెళ్లగా ఒండు మట్టిలో కూరుకు పోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు డీఎస్పీ చంద్రశేఖర్‌ నాయక్‌ తెలిపారు. సింధనూరు గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రిజర్వేషన్‌ కల్పనలో

మంత్రి విఫలం

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్‌ ప్రకటించడంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మహాదేవప్ప విఫలమయ్యారని, ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని ఎస్సీ రిజర్వేషన్‌ పోరాట సమితి సంచాలకుడు మారెప్ప సర్కార్‌ను డిమాండ్‌ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదిక అధారంగా రోస్టర్‌ పద్ధతిలో రిజర్వేషన్‌ కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్కార్‌ ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయాలన్నారు. శ్రీనివాస్‌, హేమరాజ్‌, ఆంజనేయ, నరసింహులు, తాయప్ప ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement