మైసూరు: నిప్పంటుకొని రాగి పంట కాలిపోయిన ఘటన జిల్లాలోని సరగూరు తాలూకాలోని హుల్లెమల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మంజునాథ్, బసవరాజులు 15 రోజుల క్రితం రాగి పంటను కోసి ఇంటి వెనుక నిల్వ చేశారు. శుక్రవారం రాత్రి వాములకు నిప్పంటుకోవడంతో స్థానికులు వెళ్లి ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఐదు ఎకరాల్లోని రాగి పంట మొత్తం దగ్ధమైంది. రైతు మంజునాథ్ మాట్లాడుతూ మూడు రోజుల్లో రాగులను నూర్పిడి చేయాల్సి ఉండగా ఇంతలో అగ్నికి ఆహుతైందని వాపోయాడు. దాదాపు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని, అధికారులు తగిన పరిహారం అందించాలని కోరారు. రెవెన్యూ శాఖ అధికారి నాగప్ప సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.


