బళ్లారిఅర్బన్: నగరంలోని ఆంధ్రాళ్ కర్ణాటక గృహ మండలి కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని యజమానుల క్షేమాభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. శనివారం నగరంలోని ప్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఎం.నబీసాహెబ్ మాట్లాడారు. కాలనీలో అంతర్గత కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బ తిన్నాయన్నారు. తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతోందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ కొరత కూడా తీవ్రంగా ఉందని చెప్పారు. కాలనీలో వీధి దీపాల ఏర్పాటు విషయంలో సంబంధిత శాఖలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, పార్క్ కోసం కేటాయించిన స్థలాలను అభివృద్ధి చేయకుండా వదిలేయడంతో అడవిలా మారాయని తెలిపారు. రోడ్ల పక్కన పెరిగిన మొక్కలు, పొదలు దారిన వెళ్లేవారికి ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నారు. కాలనీలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్‌ను సక్రమంగా వినియోగించక పోవడంతో తాగునీటి సమస్య ఎదురవుతోందన్నారు. కాలనీకి అనుసంధానంగా ఉండే ప్రధాన ప్రవేశ ద్వారం సమస్యను కూడా ఇంకా పరిష్కరించలేదన్నారు. సీఏ సైట్లను సరైన విధంగా నిర్వహించక పోవడంతో అవి మద్యం సేవించే వారి అడ్డాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో భద్రత దృష్ట్యా పోలీస్ బీట్ పెంచాలని, కాలనీ నివాసితులు అన్ని రకాల పన్నులు, బిల్లులు చెల్లిస్తున్నా సంబంధిత శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు. సరైన డ్రైనేజీ కనెక్షన్లు లేకపోవడంతో ఇళ్లలోకి శౌచాలయాల నుంచి దుర్వాసన వస్తోందని, దీని వల్ల ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.


