
పేద రోగుల పాలిట కామధేనువు కిమ్స్ ఆస్పత్రి
హుబ్లీ: కిమ్స్ ఆస్పత్రి అంటే ఉత్తర కర్ణాటక పేద రోగుల పాలిట ఆరోగ్య కామధేనువు. నిత్యం ఆయా జిల్లాల నుంచి వందలాది రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఆ మేరకు వారు రోగ నిర్థారణ కోసం గంటల పాటు వేచి ఉండక తప్పడం లేదు. ఎక్స్‌రే, స్కానింగ్ ఇతర రక్త పరీక్షల ఫలితాలను ఆన్‌లైన్‌లో అందించే కొత్త టెక్నాలజీ నిర్వహణ ప్రారంభం కావడంతో సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. కిమ్స్‌లో ఎముకలు, కీళ్లు, గర్భిణిలు, కేన్సర్‌తో పాటు నానా రోగాలకు పరీక్ష కోసం ఎక్స్‌రే, డాప్లర్, ఈసీజీ, సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ల ఫలితాల నివేదికతో పాటు రక్త పరీక్షల ఫలితాల కోసం ఎక్స్‌రే, ల్యాబ్ విభాగాల ముందు రోగులు పడిగాపులు పడేవారు. అయితే ప్రస్తుతం అన్ని విభాగాల వైద్యులకు ఆన్‌లైన్ ద్వారానే ఈ సౌకర్యం లభించనుంది. ఇటీవల ప్రారంభమైన ఈ సౌకర్యం వల్ల రోగులకు అనుకూలమైంది. ఇక్కడ రోజు 700 నుంచి 900 వరకు రోగులు ఎక్స్‌రే, స్కానింగ్ పరీక్షలు చేయించుకుంటారు. ఈ క్రమంలో వాటి నివేదికల కోసం మధ్యాహ్నం, సాయంత్రం వరకు అక్కడ కదలకుండా ఉండి రిపోర్ట్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఆన్‌లైన్ వ్యవస్థ జారీ కావడంతో ఇక వేచి ఉండే ప్రక్రియ అవసరం ఉండదని, రక్త పరీక్షలతో పాటు అన్ని కూడా డాక్టర్ టేబుల్‌పై ఉన్న కంప్యూటర్‌లోనే ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. ఈ విషయంపై కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రామలింగప్ప అంతరసాని మాట్లాడుతూ ఏడాది క్రితమే ఈ ప్రక్రియ రూపొందినా సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం విజయవంతంగా ఈ ట్యాక్స్ వ్యవస్థ ద్వారా కిమ్స్‌లో ఇక కాగితం, ఎక్స్‌రే, స్కానింగ్ సిల్స్‌కు ఖర్చు చేస్తున్న సుమారు రూ.కోటి ఖర్చు మిగిలిందన్నారు. ప్లాస్టిక్ రహిత పరిసరాల నిర్మాణంతో తోటి ఆస్పత్రులకు ఆదర్శంగా నిలిచామని, అత్యాధునిక వసతులతో రోగులకు సదా అందుబాటులో ఉంటున్నట్లు ఆయన తెలిపారు.
క్షణాల్లోనే ఆరోగ్య పరీక్ష నివేదిక ఆన్‌లైన్‌లో అందుబాటులోకి