దేవాదాయశాఖలో వింత పోకడ 2024లో వేములవాడలో అక్రమార్కులకు క్లీన్‌చిట్ శాఖాపరమైన చర్యల అనంతరం ఇంక్రిమెంట్లలో కోత ఇప్పుడు వారిపై చర్యల ఎత్తివేతకు సన్నాహాలు వారి దారిలోనే కొండగట్టు సిబ్బంది సైతం రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతున్న అధికారి
సాక్షిప్రతినిధి, కరీంనగర్●:
తప్పు చేసిన వారు కర్మ ఫలం అనుభవించకుండా తప్పించుకోలేరు అన్న విషయం దేవాదాయశాఖలో ఇప్పుడు కాస్త తిరగబడినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు అక్రమాలకు పాల్పడిన వారిని దోషులుగా చర్యలు తీసుకున్న తరువాత ఇప్పుడు వారంతా మంచివారంటూ క్లీన్‌చిట్ కోసం ప్రయత్నాలు ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది. అవినీతి పరులకు క్లీన్‌చీట్ ఇచ్చేందుకు కొందరు పెద్దలు అండగా నిలుస్తున్నారన్న విషయం శాఖలో సంచలనంగా మారింది.
అసలేం జరిగింది?
వేములవాడ రాజన్న ఆలయంలో 2021లో రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. శానిటేషన్, విచారణ గదులు, ప్రసాదాల తయారీ విక్రయాలు, అన్నదానం, కల్యాణకట్ట, గోదాం తదితర వ్యవహారాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. పదిమంది ఆలయ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగి ఒకరు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరు, కల్యాణకట్టలో నాయి బ్రాహ్మణుడితో కలిపి 13మందిపై చర్యలు తీసుకోవాలని అప్పటి దేవాదాయశాఖ అధికారులకు నివేదిక సమర్పించారు. దేవాదాశాఖ అధికారులు ఆలయ కార్యనిర్వహణ అధికారిని చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, వారి నుంచి వివరణ కోరారు. సంతృప్తిగా లేకపోవడంతో మళ్లీ వివరణను పంపారు. అక్కడా సంతప్తిగా లేకపోవడంతో శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ హోదాలో ఉన్న ఓ అధికారిని మరోసారిశాఖా పరమైన విచారణకు ఆదేశించారు. సదరు అధికారి విచారణలోనూ విజిలెన్స్ అధికారులు నివేదించిన తప్పిదాలు సక్రమేనని గుర్తించారు. శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా నివేదికను రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారికి సమర్పించారు. 2024 ఏప్రిల్‌లో కొందరు ఉద్యోగులకు శాశ్వతంగా, మరికొందరికి ఏడాది పాటు ఇంక్రిమెంట్ నిలిపివేయాలని ఆదేశించారు. ఇంక్రిమెంట్ డిసెంబర్ మాసంలో ఉండగా 2024 డిసెంబర్ నుంచి దీన్ని అమలు చేశారు.


