పదేళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి ఈసారి బ్రేక్ 326 మంది ఓటర్లతో ఆదివారం ఎన్నికలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు
హుజూరాబాద్: పదేళ్లుగా ఏకగ్రీవ ఎన్నికలకు వేదికగా నిలిచిన హుజూరాబాద్ క్లబ్‌లో ఈసారి పోటీ నెలకొనడంతో ఉత్కంఠ పెరిగింది. పాలకవర్గం పీఠం కోసం అభ్యర్థులు హోరాహోరీగా ప్రయత్నిస్తుండగా..326 మంది సభ్యుల ఓటు ఎటువైపు పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు వెల్లడించనున్నారు.కాగా.. ప్రచారం సందర్భంగా అభ్యర్థులు వ్యక్తిగత పరిచయాలకు ప్రాధాన్యమిస్తున్నారు. సభ్యులను నేరుగా కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఆత్మీయ పలకరింపులు, హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఓటూ కీలకం కావడంతో గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏకగ్రీవానికి ఈసారి బ్రేక్
గత పదేళ్లుగా రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవంగా సాగిన క్లబ్ ఎన్నికల్లో ఈసారి వర్గాల మధ్య పోటీ నెలకొనడం చర్చనీయాంశమైంది. క్లబ్ నిర్వహణ, సభ్యుల మధ్య సమన్వయం, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలు ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సాయంత్రానికి ఫలితాలు
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగియనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించనున్నారు. పదేళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి ఈసారి తెరపడటంతో క్లబ్ పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠ నెలకొంది.


