కరీంనగర్: ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న 500 పడకల కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. నిత్యం 1,000 నుంచి 1,500 మంది వరకు ఓపీకి వస్తున్నా.. ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైద్య కళాశాలకు తొమ్మిది విభాగాల్లో 34 పీజీ సీట్లు కేటాయించడం సానుకూల పరిణామం. అయితే పెరుగుతున్న వైద్య విద్యా అవకాశాలకు అనుగుణంగా ఆసుపత్రి సేవలు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కార్డియాలజీ, న్యూరాలజీ వంటి స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, కోట్లాది రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం, ఓపీల్లో సీనియ ర్ వైద్యుల సేవలు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉచిత మందుల కొరత, ఎంఆర్‌ఐ సదుపా యం లేకపోవడం కూడా సమస్యలుగా మారాయి.
అందని కార్డియో, న్యూరో సేవలు
గుండెపోటు, పక్షవాతం, మెదడులో రక్తస్రావం, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణ నిపుణుల చికిత్స అవసరం. కానీ ఆసుపత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాలకు సంబంధించిన నిపుణుల సేవలు అందుబాటులో లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో బాధితులను వరంగల్, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించాల్సి వస్తోంది. కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ కేంద్రం లక్ష్యం నెరవేరాలంటే అవసరమైన వైద్యులు, సిబ్బంది, పరికరాలను పూర్తిస్థాయిలో సమకూర్చాలి.
ఓపీల్లో సీనియర్ల సేవలేవీ?
ఓపీకి వచ్చే రోగులను సీనియర్ వైద్యులు పరీక్షించి చికిత్స సూచించాల్సి ఉండగా.. కొన్ని విభాగాల్లో జూనియర్ వైద్యులే పరీక్షిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంక్లిష్ట సమస్యలతో వచ్చే రోగులకు అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణ అవసరం. పీజీ విద్యార్థుల సేవలను సైతం సీనియర్ వైద్యుల పర్యవేక్షణలోనే వినియోగించాలి.
మందుల కొరత..
ఎంఆర్‌ఐ కోసం ఎదురుచూపులు
ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు కొన్నింటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. వ్యాధి నిర్ధారణకు కీలకమైన ఎంఆర్‌ఐ సదుపాయం లేకపోవడంతో ఇతర ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. పీజీ సీట్ల కేటాయింపుతో పాటు కార్డియో, న్యూరో వైద్యులను నియమించడం, క్రిటికల్ కేర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం, మందుల సరఫరా, ఎంఆర్‌ఐ ఏర్పాటు, వైద్యుల సమయపాలనపై అధికారులు దృష్టి సారించాలి. అప్పుడే ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుంది.
రెండు నెలల్లో ఎంఆర్‌ఐ అందుబాటులోకి..
క్రిటికల్ కేర్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకం కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. ఇప్పటికే క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు పూర్తయింది. టెక్నీషియన్లు రావాల్సి ఉంది. ఎంఆర్‌ఐ మంజూరైంది. మరో రెండు నెలల్లో ఆసుపత్రిలో అందుబాటులోకి వస్తుంది. అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరితే ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించగలుగుతాం.
– వీరారెడ్డి, సూపరింటెండెంట్, జీజీహెచ్


