సిరిసిల్లటౌన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ అట్టర్‌ఫ్లాప్ షోగా ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ అధినాయకులు అభివర్ణించారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో గురువారం మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తెచ్చిన ప్రాజెక్టులకే రిబ్బన్లు కట్ చేశారని, సభలో కేసీఆర్, కేటీఆర్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలను బీఆర్‌ఎస్ నేతలు ఖండించారు. సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిరిసిల్ల స్ఫూర్తితో కొడంగల్‌ను అభివృద్ధి చేసి చూపాలని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో కరీంనగర్‌లో కేబుల్ బ్రిడ్జి, రివర్‌ఫ్రంట్ వంటి ప్రాజెక్టులు వచ్చాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గుర్తుచేశారు. కలెక్టరేట్‌కు కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించిందని, తానే భూమిపూజ చేశానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో కరీంనగర్‌కు కొత్తగా ఇచ్చిన పెద్ద ప్రాజెక్టు ఏమిటో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి పనులపై ఎంపీ బండి సంజయ్ సమక్షంలో సీఎం సమాధానం చెప్పాలన్నారు.
● బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్ల సభకు 10, 15 జిల్లాల నుంచి జనాన్ని తీసుకొచ్చారని స్థానికులు ఎవరూ లేరన్నారు. సిరిసిల్లను కేటీఆర్ అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దారని అందుకే ప్రజలు అండగా నిలుస్తున్నారన్నారు. నేత కార్మికుల కోసం తీసుకొచ్చిన వర్కర్ టు ఓనర్ పథకం ఎందుకు నిలిచిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
● మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చేపట్టిన ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం హా స్యాస్పదమన్నారు. 8వేల ఎకరాల భూముల వ్యవహారంపై సమాచారహక్కు చట్టం ద్వారా వివరాలు కోరామని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, ప్రజలకు వాస్తవాలు వివరించాలని డిమాండ్ చేశారు.
● మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి సభకు వచ్చిన జనం అభివృద్ధి కోరుకున్నారని, వ్యక్తిగత దూషణలు, రాజకీయాలను కోరుకోవడం లేదన్నారు. సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఇక్కడి ప్రజల మనోభావాల ను గౌరవించకుండా కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు.
● హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలకు రిబ్బన్లు కట్‌చేసే ప్రభుత్వంగా కాంగ్రెస్ పాలన మారిందని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న రేవంత్‌రెడ్డి, చివరికి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్‌నే ప్రారంభించారన్నారు. హుజూరా బాద్ నియోజకవర్గానికి రెండో విడత దళితబంధు నిధులు విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, తుల ఉమ, న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ద్యావ వసంత, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


