మోసపూరిత వ్యక్తులతో జాగ్రత్త
హలో.. నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ను మాట్లాడుతున్నా.. కమాన్ దగ్గర బేకరీ నీదే కదా? తనిఖీలకు వస్తున్నాం. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారా.. ఏవైనా లోపాలు ఉన్నాయా? అయితే మేమొచ్చామంటే నీకే ప్రాబ్లం. ఏదైనా ఉంటే వచ్చి కలువు. లేకుంటే కేసు కట్టాల్సి వస్తుంది.
మాట్లాడేది రమేశేనా? మీ హోటల్లో గడువు ముగిసిన ముడిపదార్థాలు వినియోగిస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. అరగంటలో దాడులుచేస్తాం. కొంత సొమ్ము మాకుపంపితే దాడులు లేకుండా వారికి సర్దిచెప్పి పంపిస్తాం అంటూ ఫుడ్ సేఫ్టీ అధికారి పేరిట బెదిరింపులు. కేవలం ఇవి రెండేకాదు కరీంనగర్ సిటీలోని పలుహోటళ్లకు, తినుబండారాల దుకాణాలకు ఫోన్‌చేసి బెదిరింపులకు షరామామూలయ్యాయి.
కరీంనగర్ అర్బన్: ఆహార భద్రతశాఖ అధికారి పేరుతో జిల్లాలో సాగుతున్నదందా వ్యాపారులను బేంబేలెత్తిస్తోంది. మామూళ్లు ఇవ్వాలని లేకుంటే తనిఖీలు చేయాల్సిందేనని హుకూం జారీచేస్తున్నారు. దర్జాగా దుకాణాల్లో తనిఖీలు చేసి మరీ డబ్బులు డిమాండ్ చేస్తుండటం గమనార్హం. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, గంగాధర, చొప్పదండి, కొత్తపల్లి, శంకరపట్నం, తిమ్మాపూర్ తదితర ప్రాంతాల్లో తనిఖీ ల పేరిట మాటల గారడీతో సొమ్ముచేసుకుంటున్నారన్న ఆరోపణలు పుష్కలం. జిల్లాలో గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్‌రెడ్డి, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ అంకిత్‌రెడ్డి మాత్రమే ఉండగా స్టాఫ్ కొరతను ఆసరా చేసుకున్న కొందరు వ్యక్తులు వసూళ్ల దందాకు తెరలేపారని స్పష్టమవుతోంది. యథేచ్ఛగా స్వీట్ దుకాణాలకు, హోటళ్లకు వెళ్లి పరిశీలించడం వంటి సంఘటనలు జిల్లాలో నిత్యం అక్కడక్కడ జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
కొంతమంది వ్యక్తులు ఆహార భద్రతా శాఖ అధికారులుగా నటిస్తూ, ఆహార వ్యాపార నిర్వాహకులు, ప్రభుత్వ వసతి గృహాల వార్డెన్లకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీలైన మార్గాల్లో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇటీవల తిమ్మాపూర్‌లోని ఒక ప్రభుత్వ వసతిగృహ వార్డెన్‌కు 7842521329 నంబర్ నుంచి మోసపూరిత కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను ఆహార భద్రతాశాఖకు చెందినవాడినని చెప్పి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర ఆహార వ్యాపార సంస్థలను సందర్శిస్తూ, తాము ఆహార భద్రతా శాఖ ఉద్యోగులమని తప్పుడు ప్రచారం చేసుకుంటూ అనుమతి లేకుండా ప్రాంగణాల్లోకి ప్రవేశించి అనధికారికంగా ఫొటోలుతీసి ఆహార వ్యాపార నిర్వాహకుల నుంచి డబ్బులు, ఇతర ప్రయోజనాలను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
మోసపూరిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తాము ఆహార భద్రతాశాఖ అధికారులమని తప్పుడు సమాచారమిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇటీవల తిమ్మాపూర్ వార్డెన్‌ను కూడా బెదిరించారు. ఫుడ్‌సేఫ్టీ అధికారులు, సిబ్బందిమని బెదిరిస్తే 7032087727 లేదా 9404893871 నంబర్‌కు సమాచారమివ్వండి.
– రోహిత్‌రెడ్డి,
గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్


