తూకం.. తిరకాసు! | - | Sakshi
Sakshi News home page

తూకం.. తిరకాసు!

Oct 2 2026 3:03 AM | Updated on Oct 2 2026 3:03 AM

తూకం.. తిరకాసు!

తనిఖీల వివరాలు

యథేచ్చగా మోసం.. వినియోగదారులకు శాపం

అటకెక్కిన పర్యవేక్షణ.. అంతు లేని అక్రమాలు

ఫిర్యాదులా.. టోల్‌ ఫ్రీ నంబర్‌: 1800114000, 1915

కరీంనగర్‌ అర్బన్‌: కల్తీ రక్కసి రాజ్యమేలుతుంటే తూకంలో కోత యథేచ్చగా సాగుతోంది. నడి బజారులో తూకం దగాకు గురవుతోంది. ఏటా తనిఖీలు చేసి స్టాంపింగ్‌ వేయాల్సిన తూనికలు, కొలతలశాఖ సిబ్బంది కొరతతో మామూళ్లకే పెద్దపీట వేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారులు కిలోకు 50–100గ్రాముల వరకు చిల్లు పెడుతున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో తూకంలో డొల్లతనం బయటపడగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉత్తదేనని స్పష్టమవుతోంది. ప్రకాశఽం గంజ్‌, పండ్ల మార్కెట్‌, శనివారం అంగడి, కశ్మీర్‌గడ్డలో గల రైతు బజార్‌, చేపల మార్కెట్‌, ప్రముఖ సూపర్‌ మార్కెట్‌లలో పలు వస్తువులను కొనుగోలు చేసి తూకం వేయగా వ్యత్యాసమేర్పడటం విమర్శలకు తావిస్తోంది.

స్టాంపింగ్‌ ఏదీ.. తనిఖీలేవీ?

తూనికలు కొలతలశాఖలో ఖాళీలు వెక్కిరిస్తుండగా ఉన్న అధికారులు మొద్దునిద్ర వహిస్తున్నారు. మొక్కుబడి తనిఖీలు తప్పా కేసుల ప్రగతి కనిపించడం లేదు. రాజకీయ ఒత్తిడులు ఉన్నాయంటూ వ్యాపారులతో ఉన్న అనుబంధంతో మామూలుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వ్యాపారులు ఽఅధిక ధరలకు విక్రయిస్తునే తూకంలోనూ దోచుకుంటున్నారు.

నాణ్యమైన సేవలా.. అవెక్కడా?

వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలన్న వ్యాపార సూత్రాన్ని తుంగలో తొక్కుతున్నారు. ఇరవై ఏళ్ల క్రితం నాణ్యతలో వ్యాపారులు పోటీపడేవారు. కానీ.. ప్రస్తుతం అనతికాలంలోనే సంపన్నులు కావాలనే దురాశతో అడ్డదారులు తొక్కుతున్నారు. వస్తువులను కల్తీ చేస్తుండగా తూకంలో దగాకు పాల్పడుతున్నారు. దీంతో కిలోకు గతంలో రూ.5–10లాభం పొందగా ప్రస్తుతం కల్తీ, తూకంలో మోసంతో కిలోకు రూ.30–45వరకు లాభాలు గడుస్తున్నారు. 20 ఏళ్ల క్రితం గ్యాస్‌ను తూకం వేసి ఇచ్చేవారు. కానీ.. నేడా పరిస్థితి లేదు.

చేపల మార్కెట్‌ సమీపంలోని మార్కెట్‌లో 300 గ్రాముల మటన్‌ కొనుగోలు చేయగా మళ్లీ తూకం వేస్తే 246 గ్రాములు మాత్రమే తూగింది. కిలోకు 170గ్రాములకు పైగానే తూకంలో దోచేస్తున్నారు. ఈ లెక్కన రూ.150 నొక్కేస్తున్నారు.

నగరంలోని వెంకటేశ్వర ఆలయ సమీపంలో గల మార్కెట్‌లో టమాట రెండు కిలోలు కొనుగోలు చేయగా మళ్లీ తూకం వేస్తే 1,860 గ్రాములు వచ్చింది. 140గ్రాములు తక్కువగా రావడం విశేషం.

విద్యానగర్‌లోని ఓ చికెన్‌ సెంటర్‌లో 300గ్రాములు చికెన్‌ కొనుగోలు చేయగా మరో చోట తూకం వేయగా 236 గ్రాములే వచ్చింది. ఈ లెక్కన కిలోకు 190 గ్రాములకు పైగా తూకంలో దోచేస్తున్నారు.

స్థానిక పండ్ల సముదాయంలో కిలో ఆపిల్‌ కొనుగోలు చేయగా వాటిని తూకం వేస్తే కేవలం 865 గ్రాములే తూగింది. 135 గ్రాములు తక్కువగా వచ్చింది.

ముద్రలేవి? మేళాలతోనే ఫలితం

తూకానికి వినియోగించే సామగ్రికి ముద్రలను ప్రతి ఆరునెలలు, ఏడాదికి సంబంధితశాఖ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో అలాంటివేమీ కనిపించడం లేదు. కాలంచెల్లిన తూకం సామగ్రిని వాడుతూ వినియోగదారులను మోసగిస్తున్నారు. ముద్రల ద్వారా జిల్లాలో రూ.40 లక్షల వరకు ఆదాయం సమకూరే వీలుంది. ఆ దిశగా చర్యలు లేకపోవడం విడ్డూరం. ఇక లీటర్ల కొద్ది విక్రయించే వాటిలోనూ మోసాలే. ప్యాకెట్లలో ద్రవ పదార్థ రూపంలో మార్కెట్లో లభించేవన్నీ దాదాపు అక్రమ విక్రయాలే. ప్రభుత్వ గుర్తింపు పొందినవి కొన్నే ఉంటాయి. లీటర్లు, కిలోల లెక్కల్లో వ్యత్యాసాలతో వినియోగదారులు నష్టపోతున్నారు. కిలో నూనె కావాలని దుకాణానికి వెళ్లిన ఓ వినియోగదారుడు లీటర్‌ లెక్కనా 100గ్రాములు తక్కువగా వచ్చింది. తూకం సామగ్రికి ముద్రలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మేళాలు నిర్వహిస్తే ఆదాయాన్ని పెంచుకునే వీలుంది. తద్వారా సర్కారుకు ఆదాయంతో పాటు వినియోగదారులకు తూకులో మోసపోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

ఆగస్టు వరకు నమోదైన కేసులు: 152

తక్కువ తూకం కేసులు: 23

ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు

విక్రయించిన కేసులు: 13

రాజీ రుసుం: రూ.5.44లక్షలు

ముద్ర రుసుము: రూ.11,35,242

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement