కరీంనగర్‌టౌన్: విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేపట్టింది. విద్యార్థులు చదివే పాఠశాలలోనే వారి పరీక్ష పత్రాలను ఉపాధ్యాయులు దిద్దే విధానానికి స్వస్తి పలికి.. ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో క్రాస్ వాల్యుయేషన్ చేయించనున్నారు. మార్కుల కేటాయింపులో ఏకరీతి, పారదర్శకత, నిష్పాక్షికతను పెంచడమే లక్ష్యంగా ఈ విధానాన్ని 2026–27 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. పదోతరగతి వార్షిక పరీక్షల తరహాలోనే 1 నుంచి 9వతరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–1, ఎస్‌ఏ–2, పదోతరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–1 పరీక్షల జవాబు పత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించనున్నారు. కొత్త విధానంపై జిల్లాలోని ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పరీక్షలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారు. ఆయా సబ్జెక్టుల పరీక్షలు పూర్తయిన రోజే ప్రధానోపాధ్యాయులు జవాబు పత్రాలను సేకరించి సీల్ చేసి ఎమ్మార్సీలకు అప్పగిస్తారు. మండలంలోని ఇతర పాఠశాలల ఉపాధ్యాయులకు వాటిని కేటాయించి మూల్యాంకనం చేయిస్తారు. ఈ ప్రక్రియను 3 నుంచి 5 రోజుల్లో పూర్తి చేసి.. మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. మూల్యాంకనానికి ఉపాధ్యాయులను ఎంఈవోలు కేటాయించడంతోపాటు కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చేపడతారు.
మూల్యాంకన కేంద్రాల నిర్వహణ కోసం ఒక్కో మండలానికి రూ.10వేల చొప్పున నిధులు కేటాయించనున్నారు. మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు ప్రాథమిక స్థాయిలో ఒక్కో పేపర్‌కు రూ.2, ఉన్నత పాఠశాల స్థాయిలో రూ.3 చొప్పున పారితోషికం ఇవ్వనున్నారు. మొత్తం ప్రక్రియను జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షించనున్నారు. ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తే.. వ్యక్తిగత అభిప్రాయాల ప్రభావం తగ్గి మార్కుల కేటాయింపులో ఏకరీతి వస్తుందని విద్యాశాఖ భావిస్తోంది. వివిధ పాఠశాలల విద్యార్థుల జవాబు పత్రాలను పరిశీలించడం ద్వారా వారి అభ్యసన స్థాయి, సాధారణంగా ఎదురవుతున్న సమస్యలపై ఉపాధ్యాయులకు అవగాహన కలుగుతుందని చెబుతున్నారు.


