● సభ్యులుగా అదనపు కలెక్టర్, డీసీవో ● ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
కరీంనగర్ అర్బన్: కేడీసీసీబీకి పర్సన్ ఇన్‌చార్జిగా కలెక్టర్ చిత్రామిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక సహకార సంఘాలకు పెద్దన్నగా వ్యవహరించే కేడీసీసీబీలో చైర్మన్‌లేక గత కొన్ని నెలలుగా రుణాల మంజూరుకు బ్రేక్ పడింది. రూ.10 లక్షలకు మించి ఇచ్చే రుణాలకు పాలకవర్గం ఆమోదం తప్పనిసరి. గత జూన్ నుంచి చైర్మన్ లేదా పర్సన్ ఇన్‌చార్జిలేక పోటీ బ్యాంకులకు దీటుగా సేవలందించలేకపోతుంది. కేడీసీసీబీ పరిధిలో ఉమ్మడి జిల్లాలో 131 ప్రాథమిక సహకార సంఘాలుండగా ఇప్పటివరకు 30 సంఘాలకు నామినేటెడ్ తరహాలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను నియమించారు. అన్ని సంఘాలకు పాలకవర్గాలను ప్రకటించకపోగా కేడీసీసీబీ చైర్మన్ ఎన్నిక ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన పర్సన్ ఇన్‌చార్జి కమిటీని నియమించగా పర్సన్ ఇన్‌చార్జి (ఛైర్మన్)గా కలెక్టర్‌ను నియమించింది. అలాగే కమిటీ సభ్యులుగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, డీసీవో రాజామానుజాచార్యులును నియమించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇదేవిధా నం అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. బ్యాంకు రోజువారీ వ్యవహారాలు నిర్వహించడంతో పాటు గతంలో ఉన్న మేనేజింగ్ కమిటీకి సంబంధించిన పరిపాలనా.. ఆర్థిక అధికారాలను వినియోగిస్తుంది. బ్యాంకు చట్టబద్ధమైన నిబంధనలు, నియంత్రణ సంస్థల నిబంధనలు పాటించేలా చూస్తుంది.
అమరవీరులకు పిండ ప్రదానం
కరీంనగర్ టౌన్: పితృ అమావాస్య పురస్కరించుకుని కరీంనగర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి నాయకత్వంలో ఉద్యమకారులు అమరవీరులకు బియ్యం సమర్పించి, వారి ప్రాణత్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని కోరారు.


