● పట్టుబడితే రూ.10వేల జరిమానా ● జూబ్లీనగర్ పంచాయతీ పాలకవర్గం నిర్ణయం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం జూబ్లీనగర్ గ్రామపంచాయతీ పాలకవర్గం గాంధీజయంతి రోజు నుంచి గ్రామంలో బహిరంగంగా మద్యం తాగడంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం గాంధీజయంతి సందర్భంగా ఇందుకు సంబంధించిన పోస్టర్లను సర్పంచ్ సుద్దాల కమలాకర్‌గౌడ్, వార్డుసభ్యులతో కలిసి ఆవిష్కరించారు. బహిరంగంగా మద్యం తాగితే రూ.10వేల జరిమానా చెల్లించాలని, వారి ఫొటో తీసి, సమాచారం అందించినవారికి రూ.500 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. గ్రామంలో బహిరంగ మద్యపానం నిషేధం అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కరీంనగర్: కరీంనగర్‌లోని ప్రముఖ వ్యాపార, వాణిజ్య కూడలి అయిన టవర్ సర్కిల్‌లో టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి వందేమాతరం గీతాలాపన కార్యక్రమం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు హాజరై ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఈ పూర్తిస్థాయి వందేమాతర గీతాలాపనను ప్రారంభించారు. యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో వందేమాతరం నినాదం కోట్లాది మంది త్యాగధనుల్లో దేశభక్తి ఉప్పొంగేలా చేసిందని, నేటి తరం యువత, నగర పౌరుల్లో అదే జాతీయ స్ఫూర్తిని నింపడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఉదయం 8 గంటలకు ఈ గీతం ప్రారంభమైనప్పుడు నగర పౌరులు, వ్యాపారులు, వాహనదారులు ఎక్కడికక్కడ గౌరవ సూచకంగా నిలబడి జాతీయ భావాన్ని చాటా లని కోరారు. కార్పొరేటర్లు వంగల పవన్, రామన్, టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు, టవర్ సర్కిల్ ప్రాంతానికి చెందిన వ్యాపారులు పాల్గొన్నారు.


