ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అన్నిశాఖల అధికారులు, మంత్రులతో సమీక్ష
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పలకరిస్తూ..
పాదయాత్ర చేస్తూ..
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ.. పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. సిరిసిల్ల వీధుల్లో 30 నిమిషాలపాటు మూడు కిలోమీటర్లు సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తూ.. దారి వెంట ఉన్న యువకులను, మహిళలను, నేతన్నలకు అభివాదం చేస్తూ ఉత్సాహం నింపారు. సీఎం ప్రసంగంలోనూ సిరిసిల్లలో మూడురంగుల జెండా ఎగురాలని, మంత్రి చాన్స్ వస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు పద్మశాలీ బిడ్డను ఎమ్మెల్సీని చేస్తామని ప్రకటించారు. ఎవరా అభ్యర్థి.. అనే చర్చ మొదలైంది. సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత పాలకులు సిరిసిల్ల నేతన్నలకు పెట్టిన రూ.350 కోట్ల బకాయిలను ప్రజా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా రూ.50 కోట్ల మేరకు నేతన్నల వ్యక్తిగత రుణాలు మాఫీ చేశామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. నేరెళ్ల ఘటన సమయంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమారిని తీసుకొచ్చి న్యాయం చేయాలని పోరాటం చేశామని గుర్తు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 2023, డిసెంబర్‌లో ప్రజా పాలన వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం, ప్రజ లకు వసతుల కల్పన, ప్రజా సంక్షేమం, నేతన్నల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టా మని బీసీసంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నేరెళ్ల బాధితులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి మొదటి అడుగు పడిందని, రెండో అడుగు సిద్దిపేటలో, మూడో అడుగు గజ్వేల్‌లో పడుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నా రు. నేరెళ్ల బాధితులకు రూ.10 లక్షల చొప్పున కొందరికి, రూ.5 లక్షల చొప్పున మరికొందరికి ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ చేశారు.
శంకుస్థాపన.. ప్రారంభోత్సవాలు
సిరిసిల్ల, వేములవాడల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకు రూ.200 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ స్కూళ్ల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.99.40 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో ఆఫీస్‌లకు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగి తహసీల్దార్ ఆఫీస్‌లకు, వేములవాడ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు, రుద్రంగిలో 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించే గోదాముకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో నిర్మించిన జిల్లా సమాఖ్య భవవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, జిల్లాలోని అన్ని మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్ అర్బన్: నగరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనతో నయాజోష్ నింపింది. హెలీ క్యాప్ట ర్‌లో వచ్చిన సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి, కొత్త కలెక్టరేట్ ప్రారంభించారు. ఉద్యోగులు, పాలకులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతీ పేదోడికి కలెక్టరేట్ భరోసాగా ఉండాలని, సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. బుధవారం సమీకృత కార్యాలయాల జిల్లా సముదాయాన్ని షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం రూ.51కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించారు.
నూతన కలెక్టరేట్ భవనం పేద ప్రజలకు విశ్వాసం, భరోసా కల్పించే విధంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అధి కారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నూతన కలెక్టరేట్ ద్వారా జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు మరింత మంచి పరిపాలన అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మరింత బాధ్యతతో పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ ఛైర్మన్ బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, మేయర్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, కలెక్టర్ చిత్రామిశ్రా, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీ వాకడే, డిఆర్వో జె.స్వామి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నర్సన్న, ఆర్టీఏ మెంబర్ రాహూల్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, ట్రైనీ ఐఎఎస్ హరిప్రసాద్ పాల్గొన్నారు.
రూ.29.62కోట్లతో జిల్లాలో చేపడుతున్న మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రూ.840కోట్లతో కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు, కేఎస్‌సీసీఎల్ స్పెషల్ గ్రాంట్స్ కింద రూ.21.60కోట్లతో చేపట్టిన వరద నీటి మురుగు కాల్వల నిర్మాణ పనులకు, రూ.25 కోట్లతో చేపట్టనున్న మల్టీలెవల్ పార్కింగ్ బిల్డింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.5.70 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ భవనాన్ని, రూ.6.50కోట్లతో నిర్మించిన కశ్మీర్‌గడ్డ సమీకృత వెజ్,నాన్‌వెజ్ మార్కెట్‌ను, రూ.16.50కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డీఆర్‌ఎఫ్ కార్యాలయాలను ప్రారంభించారు.
ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు
సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ చిత్రా మిశ్రా కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీస్, వివిధ శాఖల అధికారులు, ప్రొటోకాల్, భద్రత, పారిశుద్ధ్యం, విభాగాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
మీడియా పాయింట్‌లో సంబంధం లేని వ్యక్తులుండటంతో పోలీస్ నిఘా విభాగం గుర్తించింది. 10 మంది వరకు మీడియాకు సంబంధం లేని వ్యక్తులుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. కార్పొరేటర్ భాస్కర్‌నాయక్, గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం జిల్లా చైర్మన్ బాసవేని మల్లేశం సీఎంకు చిత్రపటాలను ఇచ్చేందుకు వెళ్లగా భద్రత విభాగం నిలువరించింది. సీపీ గన్‌మెన్లనూ దూరంగా పంపించడం చర్చనీయాంశమైంది.


